KTR : చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ కు కేటీఆర్ పరామర్శ.. రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు..

దాడికి పాల్పడ్డ వాళ్లు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా.. వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

KTR : చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ కు కేటీఆర్ పరామర్శ.. రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు..

Updated On : February 10, 2025 / 4:47 PM IST

KTR : చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. రంగరాజన్ పై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రంగరాజన్ పై దాడిని అత్యంత దుర్మార్గమైన, నీచమైన చర్యగా కేటీఆర్ అభివర్ణించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయి..
”రంగరాజన్ పై దాడి అత్యంత దుర్మార్గం. ఇది ఎవరు చేసినా ఏ పేరుతో చేసినా ఏ అజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. నిత్యం భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ కుటుంబపరిస్థితే ఈ విధంగా ఉందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలుస్తుంది.

Also Read : చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి.. రౌండప్ చేసి, కింద కూర్చోబెట్టి, వార్నింగ్ ఇస్తూ.. షాకింగ్ వీడియో..

దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలి..
దాడికి పాల్పడ్డ వాళ్లు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా.. వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత అవసరమైతే రంగరాజన్ కుటుంబానికి ఏర్పాటు చేయాలి” అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేటీఆర్.

సంచలనంగా మారిన రంగరాజన్ పై దాడి..
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సీఎస్‌ రంగరాజన్‌పై దాడి ఘటన కలకలం రేపింది. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో ఉన్న సమయంలో 20మంది తనపై దాడి చేశారని మొయినాబాద్ పోలీసులకు రంగరాజన్ ఫిర్యాదు చేశారు.

Also Read : చిలుకూరు బాలాజీ పూజారీపై దాడి.. పవన్ రియాక్షన్ ఇదే..!

తన ఇంటికి వచ్చిన వ్యక్తులు రామరాజ్యం కోసం సైన్యాన్ని తయారు చేయాలని తనను కోరారని రంగరాజన్ తెలిపారు. అందుకు నిరాకరించినందుకు తనపై దాడి చేశారని చెప్పారు. రాజ్యాంగబద్దంగా ముందుకు వెళ్తానని, వారు చెప్పినట్లు నడుచుకోను అన్నందుకు తనపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో రంగరాజన్ పేర్కొన్నారు. రంగరాజన్ పై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.