Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి.. రౌండప్ చేసి, కింద కూర్చోబెట్టి, వార్నింగ్ ఇస్తూ.. షాకింగ్ వీడియో..

అందుకు నిరాకరించినందుకు తనపై దాడి చేశారని చెప్పారు.

Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి.. రౌండప్ చేసి, కింద కూర్చోబెట్టి, వార్నింగ్ ఇస్తూ.. షాకింగ్ వీడియో..

Updated On : February 9, 2025 / 8:31 PM IST

Rangarajan : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సీఎస్‌ రంగరాజన్‌పై దాడి ఘటన కలకలం రేపుతోంది. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో ఉన్న సమయంలో 20మంది తనపై దాడి చేశారని మొయినాబాద్ పోలీసులకు రంగరాజన్ ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. దాడికి పాల్పడ్డ వారిలో వీర రాఘవ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది.

రామరాజ్యం కోసం సైన్యాన్ని తయారు చేయాలని ఒత్తిడి..!
రంగరాజన్ పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన ఇంటికి వచ్చిన వ్యక్తులు రామరాజ్యం కోసం సైన్యాన్ని తయారు చేయాలని తనను కోరారని రంగరాజన్ తెలిపారు. అందుకు నిరాకరించినందుకు తనపై దాడి చేశారని చెప్పారు.

రాజ్యాంగబద్దంగా ముందుకు వెళ్తానని, వారు చెప్పినట్లు నడుచుకోను అన్నందుకు తనపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో రంగరాజన్ పేర్కొన్నారు. రంగరాజన్ పై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తమ సంస్థలో చేరాలని రంగరాజన్ కు బెదిరింపులు..!
శుక్రవారం ఈ ఘటన జరిగింది. రామరాజ్యం సంస్ధకు సంబంధించిన వ్యక్తులు రంగరాజన్ పై దాడికి పాల్పడ్డారు. ఆలయ బాధ్యతలు వేరే వాళ్లకు అప్పగించి తమ సంస్థలో చేరాలని వారు రంగరాజన్ ను బెదిరించారని సమాచారం. దీనిపై రంగరాజన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన అర్చకులు రంగరాజన్ పై దాడి ఘటన సంచలనంగా మారింది. ఈ దాడిని అంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.