Medaram : గద్దెనెక్కిన సమ్మక్క.. రేపు సీఎం కేసీఆర్ రాక

సీఎం కేసీఆర్‌ శుక్రవారం మేడారం జాతరకు హాజరై తల్లులకు మొక్కులు చెల్లించుకోనున్నారు. సీఎం టూర్ ఏర్పాట్లను మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Medaram

Sammakka Saralamma Jatara 2022 : మేడారం జాతరలో రాత్రి అసలు ఘట్టం మొదలైంది. కాసేపటి క్రితం సమ్మక్క గద్దెనెక్కింది. గద్దెనెక్కడం కోసం పూజారులు అన్నీ సిద్ధం చేశారు. ఇప్పటికే సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలనెక్కి భక్తులకు దర్శనమిస్తుండగా కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని ఆదివాసీల సంప్రదాయం ప్రకారం చిలుకలగుట్ట నుంచి తీసుకొచ్చారు. ఊరిగింపు, భక్తుల కోలాహలం నడుమ మేడారంలోని గద్దె మీద ప్రతిష్టించారు. సమ్మక్క తల్లిని తీసుకువచ్చే సమయంలో.. ఆనవాయితీ ప్రకారం ములుగు జిల్లా ఎస్పీ గాల్లోకి 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మకు స్వాగతం పలికారు.

Read More : Medaram Jatara 2022 : మేడారం జాతరలో 20 ఏళ్ల తర్వాత అద్భుత ఘట్టం

రాష్ట్ర ప్రభుత్వం తరపున సమ్మక్కకు స్వాగతం పలికారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి. జాతరను తిలకించేందుకు.. మొక్కులు తీర్చుకునేందుకు .. భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర నుంచి గోండులు, కోయలు, లంబాడాలు, మధ్యప్రదేశ్ నుంచి బిల్లులు, రత్తిసాగర్ గోండులు, ఒడిశా నుంచి సవర ఆదివాసీలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఇంకా లక్షల మంది గిరిజనేతరులు మేడారం బాట పట్టారు. గ్రామాల నుంచి వారం కింద మొదలైన ఎడ్ల బండ్లు వన దేవతల సన్నిధికి చేరుకుంటున్నాయి.

Read More : Medaram Jathara 2022: మహా వన జాతరలో తొలి ఘట్టం..కుంకుమ భరిణె రూపంలో సమక్క తల్లి ఆగమనం

అటు సంద్రంలా సాగివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా .. అధికారులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. వేల మంది పోలీసులు, వందల సంఖ్యలో సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షిస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్‌ శుక్రవారం మేడారం జాతరకు హాజరై తల్లులకు మొక్కులు చెల్లించుకోనున్నారు. సీఎం టూర్ ఏర్పాట్లను మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.