Medaram Jatara 2022 : మేడారం జాతరలో 20 ఏళ్ల తర్వాత అద్భుత ఘట్టం
దక్షిణాది కుంభమేళా.. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర.. మేడారం మహాజాతర. వన జాతరలో మహాద్భుతం.

Sammakka Saralamma Jatara 2022
Medaram Jatara 2022 : దక్షిణాది కుంభమేళా.. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర.. మేడారం మహాజాతర. వన జాతర ఘనంగా ప్రారంభమైంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారారు. మేడారం అంతా జనసంద్రంగా మారిపోయింది. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే.రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ వనజాతరలో రెండు దశాబ్ధాల తర్వాత అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. 20 ఏళ్లలో మాఘశుద్ధ పౌర్ణమి రోజు మహాజాతర ప్రారంభమవ్వడం ఇదే తొలిసారి కావటం విశేషం. దీంతో గతంకంటే భక్తులు ఇంకా అధికంగా తరలివస్తున్నారు. ఆదివాసీ జనజాతరకు రెండో రోజు కూడా భక్తులు అత్యంత భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మేడారానికి వచ్చే దారి అంతా వాహనాలతో నిండిపోయింది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేడారం వన జాతరకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈక్రమంలో అమ్మవారి ప్రాంగణం కిటకిటలాడుతోంది.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభమై రెండో రోజు కొనసాగుతోంది. రెండో రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవార్ల గద్దెల వద్దకు బారులు తీరారు. జాతరలో రెండో రోజు కీలకఘట్టం సమ్మక్క ఆగమనం. చిలుకలగుట్ట దిగి ఇవాళ సాయంత్రం గద్దెపైకి సమ్మక్క వచ్చింది. కుంకుమ భరిణె రూపంలో అమ్మవారు తరలివచ్చి భక్తులకు కనువిందు చేస్తున్నారు.
జాతరలో సందడి చేస్తున్న శివసత్తుల పూనకాలు..
శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, మేళతాళాలు, ప్రభుత్వ లాంఛనాలతో.. పటిష్ఠ బందోబస్తు మధ్య సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి గద్దెపైకి తీసుకువచ్చారు. ఆ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున పోటెత్తుతారు.మేడారం సందర్శించుకోలేని వాళ్లంతా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని పక్కాగా తిలకిస్తారు. అమ్మవారి ఆగమనం సమయంలో కోరుకునే కోర్కెలు తప్పక తీరతాయని భక్తుల నమ్ముతారు. తల్లి రాకకు గౌరవ సూచకంగా జిల్లా పోలీసు అధికారి గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి.. అమ్మకు గౌరవ వందనం సమర్పిస్తారు.
20 ఏళ్ల తర్వాత అద్భుతఘట్టం..
రెండు దశాబ్దాల తర్వాత మేడారం జాతరలో అద్భుతం చోటు చేసుకుంది. గత 20 ఏళ్లలో మాఘశుద్ధ పౌర్ణమి రోజు మహాజాతర ప్రారంభమవడం ఇదే తొలిసారి కావడం విశేషం. బుధవారం రోజున సమ్మక్క తల్లి కుంకుమ భరిణె రూపంలో దేవతగా అవతరించింది. అందుకే ఆదివాసీలు ఆ మాఘశుద్ధ పౌర్ణమి రోజును అత్యంత పవిత్రంగా భావిస్తారు. అదే రోజే జాతర ప్రారంభించడం చాలా సందర్భాల్లో వీలుకాదని సమ్మక్క ఆలయ పూజరి కొక్కెర రమేశ్ తెలిపారు. ప్రతిసారి బుధవారం జాతర ప్రారంభించడం మేడారంలో ఆనవాయితీగా వస్తోంది. మాఘశుద్ధ పౌర్ణమి, బుధవారం ఒకే రోజు రావడం చాలా అరుదుగా జరుగుతుందని అన్నారు.