BJP candidate Desh Pandey
BJP Andidate Desh Pandey : తెలంగాణ బీజేపీలో టికెట్ల కేటాయింపు విషయంలో అలజడి మొదలైంది. టికెట్ల కేటాయింపులో తీవ్ర గందరగోళం నెలకొంది. పలుమార్లు అభ్యర్థుల పేర్లు, నియోజకవర్గ స్థానాలను మార్చుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ ప్రకటించిన బీజేపీ తుది జాబితా కలకలం రేపుతోంది. ఇప్పటికే రెండు స్థానాల్లో అభ్యర్థులను మార్చిన బీజేపీ తాజాగా మరో స్థానంలో అభ్యర్థిని మార్చింది. సంగారెడ్డి బీజేపీ అభ్యర్థి కేటాయింపు విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఇవాళ ఉదయం సంగారెడ్డి బీజేపీ అభ్యర్థిగా దేశ్ పాండే పేరు ప్రకటించింది. దేశ్ పాండే నామినేషన్ కు బయలుదేరుతుండగా అనూహ్యంగా సంగారెడ్డి బీజేపీ అభ్యర్థిగా పులిమామిడి రాజుకు బి ఫార్మ్ ఇచ్చింది. దీంతో రిటర్నింగ్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో దేశ్ పాండే ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కిషన్ రెడ్డి కి ఫోన్ చేసి దుఃఖంతో తన ఆవేదనను వెల్లబుచ్చారు.
బెల్లంపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా అమరజుల శ్రీదేవి బీజేపీ అభ్యర్థిగా కొనసాగుతారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం(నవంబర్ 10)న విడుదల చేసిన ప్రకటనలో బెల్లంపల్లి నుంచి ఎమాజీ పేరు వచ్చింది కానీ, ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా అమరజుల శ్రీదేవి కొనసాగుతారని పేర్కొన్నారు.
అదేవిధంగా అలంపూర్(80) శాసనసభ నియోజకవర్గం నుంచి మారెమ్మ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ కొనసాగుతారని తెలిపారు. ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థుల మార్పులను గమనించాల్సిందిగా కోరుతున్నామని పేర్కొ్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి, పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
BJP Final List : బీజేపీ తుది జాబితా విడుదల.. 14స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం
శుక్రవారం బీజేపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసింది. బీజేపీ అధిష్టానం 14స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. శేరిలింగంపల్లి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ పోటీ చేయనున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్ ను గణేష్ నారాయణ్ కు కేటాయించారు.