Rain Water : వాన నీటిలో చిక్కుకున్నస్కూల్ బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం..

మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు వర్షపు నీటిలో చిక్కుకుంది. జిల్లాలో గత 2 రోజుల నుండి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Mahabubnagar School Bus

Rain Water :  మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు వర్షపు నీటిలో చిక్కుకుంది. జిల్లాలో గత 2 రోజుల నుండి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిన్న రాత్రి కురిసిన వర్షానికి మహబూబ్ నగర్ మండలం కోడూరు దగ్గర ఉన్న రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలోకి భారీగా వర్షం నీరు చేరింది.

కాగా … మహబూబ్ నగర్ లోని ప్రైవేట్ స్కూల్ బస్సు ఒకటి సమీప గ్రామాల నుంచి విద్యార్ధులను ఎక్కించుకుని రావటానికి ఈరోజు ఉదయం బయలు దేరింది. రాంచంద్రపూర్, మాచన్ పల్లి, సుగుర్గడ్డ తాండా నుండి దాదాపు 30 మంది విద్యార్థులను ఎక్కించుకుని మహబూబ్ నగర్ వెళ్తున్న స్కూల్ బస్సు కోడూరు దగ్గర ఉన్న రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వద్దకు వచ్చే సరికి అక్కడి వర్షం నీటిలో చిక్కుకుంది.

బస్సు లో పిల్లలు కూర్చునే సీట్ల దాకా నీరు రావటంతో విద్యార్ధులు ఆందోళనకు గురయ్యారు.   దీంతో డ్రైవర్ బస్సును అక్కడే నిలిపి వేశాడు.  ఇది గమనించిన స్థానికులు విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.. బస్సు ఇంకాస్త ముందుకు వెళ్ళి ఉంటే పూర్తిగా నీటిలో మునిగిపోయేదని డ్రైవర్ నిర్లక్ష్యం కారణం గానే ఈ ఘటన చోటు చేసుకున్నదని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.