బోయిన్ పల్లి కిడ్నాప్ వెనుక ఏం జరిగిందంటే..

Sensational elements in Bhuma Akhilapriya remand report : హఫీజ్ పేట భూ వివాదంలో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ల్యాండ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. అదే సమయంలో టీడీపీ నేత, భూమా నాగిరెడ్డి అనుచరులు ఏవీ సుబ్బారెడ్డి పెద్ద ఎత్తున లాభం పొందినట్లు గుర్తించారు.
2016లో సర్వే నంబర్ 80లో 25 ఎకరాల భూమిని ప్రవీణ్ రావ్ కొనుగోలు చేశాడు. ప్రస్తుతం అదే భూమి తమదంటూ ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిల ప్రియ, భార్గవ్ రామ్ లిటిగేషన్ పెట్టారు. ఈ అంశంపై ఇరు వర్గాలు పలుమార్లు చర్చలు కూడా జరిపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ చర్చల్లో ఏవీ సుబ్బారెడ్డికి ప్రవీణ్ రావ్ డబ్బులు చెల్లించి సెటిల్మెంట్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అఖిలప్రియ ప్రవీణ్‌రావ్, ఏవీ సుబ్బారెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి విషయంలో తనతో కాకుండా ఏవీ సుబ్బారెడ్డితో ఎలా సెటిల్మెంట్ చేసుకుంటారంటూ ప్రవీణ్ రావ్‌ను బెదిరించారు.
మొదటి ఒప్పందం ప్రకారం కాకుండా పెరిగిన భూమి విలువ ప్రకారం డబ్బులు చెల్లించాలని ప్రవీణ్ రావ్‌ను, భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వేరు వేరుగా డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన ఎక్కువ డబ్బులు చెల్లించేందుకు ప్రవీణ్ రావ్ నిరాకరించాడు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే డబ్బులు చెల్లిస్తానని అఖిలప్రియకు, ఏవీ సుబ్బారెడ్డికి తేల్చి చెప్పారు.
ప్రవీణ్ రావ్ నుంచి ఎలాగైనా డబ్బులు రాబట్టాలని అఖిలప్రియ దంపతులు ప్లాన్ చేశారు. ప్రవీణ్‌రావ్ సోదరులను కిడ్నాప్ చేసేందుకు సాయి అనే కిడ్నాపర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. కిడ్నాప్ అనంతరం అవుటర్ రింగ్ రోడ్డులోని ఓ ఫామ్ హౌస్‌లో ప్రవీణ్ రావ్ సోదరులతో ఖాళీ బాండ్ పేపర్‌లపై సంతకాలు చేయించుకున్నారు. సంతకాలు తీసుకునే సమయంలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి, భార్గవరామ్ పేర్లను కిడ్నాపర్లు పదే పదే ప్రస్తావించారు. కిడ్నాప్ సమయంలో కూడా పలు మార్లు ఈ ముగ్గురితో సంభాషణ జరిపినట్లు కూడా బాధితులు వెల్లడించారు. అటు సంతకాలు తీసుకునే సమయంలో తమపై కర్రలతో దాడి చేశారన్నారు.
కిడ్నాప్ వ్యవహారంలో అఖిలప్రియను ముందే అదుపులోకి తీసుకోకపోతే కీలక సాక్ష్యాదారాలు తారుమారు అయిపోతాయని పోలీసులు భావించారు. అఖిలప్రియ, భార్గవ్ రామ్‌లకు నేరచరిత్ర ఉందని… అలాగే మంత్రిగా పని చేసిన అఖిలప్రియకు సాక్ష్యాదారులను తారుమారు చేయడంలో పలుకుబడి ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఏపీ సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు చూపించారు.