Telangana Employees : ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన ఉద్యోగుల విభజన, బదిలీలు

తెలంగాణలో ఉద్యోగుల విభజన ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అధికారుల అనాలోచిత నిర్ణయాలు ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నాయ్‌. కొత్త జీవో వల్ల 95శాతం లోకల్, 5శాతం నాన్‌ లోకల్‌కి

Telangana Employees :  తెలంగాణలో ఉద్యోగుల విభజన ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అధికారుల అనాలోచిత నిర్ణయాలు ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నాయ్‌. కొత్త జీవో వల్ల 95శాతం లోకల్, 5శాతం నాన్‌ లోకల్‌కి ఉద్యోగాలివ్వాలన్న నిబంధన అమలు కావడం లేదు. ఉన్నతాధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని.. కొందరు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. వాటన్నిటికీ చెక్‌ చెప్పేందుకు కసరత్తు చేస్తోంది తెలంగాణ సర్కార్‌.

ఉద్యోగుల విభజన, బదిలీల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317తో స్థానికతకు తూట్లు పడుతున్నాయని ఆరోపిస్తున్నారు ఉద్యోగులు, ఉపాధ్యాయులు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్‌తో కొత్త జోన్లు తెరపైకి వచ్చాయి. జోన్ల వారీగా ఉద్యోగుల విభజన ప్రక్రియ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. జోన్ల ప్రకారం విభజన, బదిలీలతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో ఉద్యోగుల కేటాయింపులో భాగంగా జూనియర్లే అధికంగా నష్టపోతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల్లో స్థానికత అంశానికి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఇప్పుడు సమస్య సర్కార్ కు తలనొప్పిగా మారింది.

ఉపాధ్యాయ బదిలీల్లో 2008, 2012 సంవత్సరాల్లో డిఎస్సికి ఎంపికైన అభ్యర్థులు, 2017 టిఆర్టీ ద్వారా ఉద్యోగాలు పొందిన వారికే ఎక్కువ నష్టం కలుగుతుంది. దాదాపు ఇరవై ఐదు వేల మంది బలవంతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. అయితే.. ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల గోడును గాలికి వదిలేసి ఇబ్బందులకు గురి చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. లోకల్ పోస్టుల్లో నాన్ లోకల్ ఉద్యోగాలు వచ్చి చేరడంతో ఉద్యోగ ఖాళీలు గల్లంతయ్యే అవకాశాలున్నాయ్. దీంతో ఉద్యోగుల విభజన విషయంలో సీఎం కేసీఆర్‌ కూడా సీరియస్‌గా ఉన్నారట. ప్రభుత్వం ఒకటి తలిస్తే మరొకటి జరగడంతో అసలుకే మోసం వచ్చిందన్న ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలిసింది.

Also Read : Gandhi Hospital : దక్షిణాది నుంచి క్లినికల్ ట్రయల్స్‌కు ఎంపికైన గాంధీ ఆసుపత్రి

ఉద్యోగుల సంఘాలు వరుసగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. అనాలోచిత నిర్ణయం కారణంగా ప్రభుత్వం బద్నామ్ అయ్యే అవకాశాలు ఉండటంతో మరో రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో ఉన్న టీచర్లకు మాత్రమే కేటాయింపులు జరిగాయి. దీంతో హైదరాబాద్ లో స్థిరపడిన సీనియర్లు, ఉపాధ్యాయులు, ఈ విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే.. ఇలా సీనియార్టీ ప్రకారం చూసుకుంటే సీనియర్లు పట్టణాలను వదలి గ్రామాలకు వెళ్లాల్సి రావడమే అసలు కారణం అన్న విషయం తెలుస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు