Telangana Officers: ఉద్యోగం ఉంటే సరిపోదు. మనం చెప్పినట్లు నడవాలే. అనుకున్న ఫైల్ ముందుకు కదిలిపోవాలి. రెండు చేతులా సంపాదించాలి. కోట్లకు పడగెత్తాలి. తెరవెనుక ఉండి చక్రం తిప్పాలి. ఈ అత్యాశ..అధికార దాహమే కొందరు అధికారులకు దోపిడీకి దారి తీస్తోందట. బాలీవుడ్ వెబ్ సిరీస్‌ను తలపించేలా ఓ కథ వెలుగులోకి వచ్చింది. అదే పొలిటికల్ లీడర్లకు ఆఫీసర్ల ఫండింగ్. ఇదేక్కడి కథ అని షాక్ కావొచ్చు. కానీ కొందరు ఆఫీసర్లు తెర వెనుక చక్రం తిప్పేందుకు..తమ హవా నడిపించుకునేందుకు కొత్త ప్లాన్ చేశారట.
లంచాలు, బెదిరింపులు చేసి వసూలు చేసిన సొమ్మును..గత అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులకు ఫండింగ్‌గా ఇచ్చారట. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలోని గెలుపుగుర్రాలకు విరాళం ఇచ్చి..అందులో గెలిచి ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నవారి అండదండలతో ఎడపెడా దందాలు చేస్తున్నారట. తాము అనుకున్న పనులు చేయించుకునేందుకు..ఫైల్స్ క్లియర్ చేయించుకునేందుకు..శాఖల్లో తమ ఆధిపత్యం నడిపించుకుంటున్నారట.
ఈ క్రమంలోనే తెలంగాణలోని విద్యుత్ శాఖ సిబ్బంది లంచాల వసూళ్లు, అవినీతిపై కొత్త అంశాలు బయటికి వచ్చాయంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో లంచాల వసూళ్లలో పేరుగాంచిన ముగ్గురు విద్యుత్ ఇంజినీర్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు కావాల్సిన నేతకు విరాళం ఇచ్చారట. ఈ విషయాన్ని ప్రభుత్వం అంతర్గత విచారణలో గుర్తించిందట.
Also Read: ఢిల్లీ టూర్లతో లోకేశ్‌కు ఫ్యూచర్ లీడర్‌గా ఎలివేషన్.. బీజేపీ పెద్దలకు ఎందుకు దగ్గరవుతున్నట్లు?
ఒక ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థికి ముగ్గురు ఇంజినీర్లు నేరుగా రూ.కోటి విరాళం ఇచ్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు తమ పరిధిలోని పరిశ్రమలు, వ్యాపారుల నుంచి ఈ ముగ్గురూ వసూలు చేసి ఎన్నికల ప్రచారం కోసం ఫండింగ్ చేశారట. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమకు అన్ని విధాలా అండగా ఉండాలనే ఒప్పందంతో విరాళం ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
విద్యుత్ శాఖలోనే కాదు..పోలీస్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్లలో కూడా కొందరు అధికారులు..ఇదే రూట్‌ను ఫాలో అయ్యారట. కొందరు ఉన్నత పదవుల కోసం..మరికొందరు ఆస్తులు సంపాదించుకునేందుకు..మరికొందరు అధికార దర్పం కోసం రాజకీయ నేతలను ముందు పెట్టి వెనకుండి చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారట. ఇలా గత ఎన్నికల్లో పలువురు నేతలకు ఫండింగ్ చేస్తే..అందులో కొందరు గెలిచి ఇప్పుడు ఉన్నత పదవుల్లో ఉన్నారట. అప్పుడు తమకు ఫండింగ్ చేసిన పలువురు అధికారులకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారట పలువురు లీడర్లు.
కోరుకున్న పదవులు దక్కేలా చక్రం
వాళ్లు అనుకున్న పనులు అయ్యేలా.. కోరుకున్న పదవులు దక్కేలా ఆఫీసర్ల తరఫున నేతలే ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారట. అయితే లీడర్లకు విరాళం ఇచ్చేందుకు అధికారులు కిందిస్థాయి సిబ్బంది దగ్గర చందాలు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయట. అలా పై ఆఫీసర్ల కిందున్న అధికారులు పలువురు ఏసీబీకి పట్టుబడటంతో..లీడర్లకు ఫండింగ్ చేసిన విషయం వెలుగులోకి వచ్చిందంటున్నారు. ఏసీబీకి చిక్కిన అధికారులకు క్లీన్ చిట్ వచ్చేలా కూడా లీడర్లకు విరాళాలు ఇచ్చిన ఆఫీసర్లు తెరవెనుక ప్రయత్నం చేస్తున్నారట.
అందుకు కొందరు నేతల సహకారం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదైనా అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు ఆఫీసర్ల ఫండింగ్ అనేది మాత్రం పెద్ద చర్చకు దారితీస్తోంది. రాజకీయ నేతలకు విరాళం ఇచ్చేంత స్థాయిలో అధికారులకు సంపాదన ఎలా వస్తుందన్న చర్చ జరుగుతోంది. ఆఫీసర్లు కూడా..తమ మాస్టర్ మైండ్‌తో ఎవరు ప్రభుత్వంలోకి వస్తారు..ఎవరు గెలిస్తే తమ పనులు సాఫీగా జరిగిపోతాయనే దానిపై లెక్కలు వేసుకుని మరీ ఫండింగ్ చేసినట్లు చర్చ జరుగుతోంది.
కొంతమంది రాష్ట్రస్థాయిలో పేరున్న ఉన్నతాధికారులు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు ఫండింగ్ చేశారట. ఆ తర్వాత తాము కోరుకున్న నేతలు గెలిచాక..వారి ద్వారా ఆర్థికంగా..ప్రభుత్వ పరంగా లబ్ధి కూడా పొందినట్లు కిందిస్థాయి అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం మీద ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.