Sita Rama Lift Irrigation Project : ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. మూడు పంపు హౌస్ లకు గాను ఇవాళ రెండు పంప్ హౌస్ లకు ట్రయల్ రన్ పూర్తైంది. సీతారామ ప్రాజెక్ట్ పూర్తైతే 10లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 3 జిల్లాల రైతులకు మేలు జరగనుంది. ఈ ప్రాజెక్ట్ తో గోదావరి, కృష్ణ నీళ్ల అనుసంధానం కానుంది. ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ లను ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి కానున్న తొలి ప్రాజెక్ట్ ఇదే.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని పంట భూములకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ సీతారామ ఎత్తిపోతల పథకం. భదాద్రి జిల్లా అశ్వాపురం మండలం అయ్యగారి పల్లి వద్ద ఈ ప్రాజెక్ట్ నిర్మాణం సాగుతోంది. గోదావరిలో ఆనాడు సర్ అర్ధర్ కాటన్ దుమ్ముగూడెం టెయిల్ పాండ్ నిర్మాణం చేపట్టారు. ఈ టెయిల్ పాండ్ నిర్మాణం వద్ద ఎప్పుడూ సమృద్ధిగా నీరు నిల్వ ఉంటుంది. అందువల్లే అక్కడ ఎత్తిపోతల పథక నిర్మాణానికి అప్పటి సీఎం కేసీఆర్ స్థలాన్ని ఎంపిక చేశారు. అంతేకాదు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని రోళ్లపాడు వద్దకు తరలించి అక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని భావించారు. అందుకు అనుగుణంగానే అక్కడ శంకస్థాపన చేశారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్ట్ కోసం రూ.7వేల కోట్లు కూడా ఖర్చు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులను ఖర్చు చేసి మోటార్లను ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురికి మంత్రి పదవులు దక్కడం ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి పెట్టారు. మొత్తానికి ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ లను ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు. దీంతో ఖమ్మం జిల్లా రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది.
* సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ లకు ట్రయల్ రన్ నిర్వహణ
* ఆగస్టు 15న ప్రాజెక్ట్ ను ప్రజలకు అంకితం చేయనున్న సీఎం రేవంత్
* ప్రాజెక్ట్ 2, 3 లిఫ్ట్ ఇరిగేషన్లను ప్రారంభించనున్న సీఎం రేవంత్
* లక్ష 75వేల ఎకరాలకు సాగునీరు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్
* ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు సాగునీరు లక్ష్యంగా ప్రాజెక్ట్ నిర్మాణం
* ఏటా 6 లక్షల ఎకరాలకు సాగునీరు
* 2026 ఆగస్టు 15 నాటికి ఆయకట్టులోని ప్రతి ఎకరాకు నీరు
Also Read : తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసం ఆందోళనకరం- ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు