తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసం ఆందోళనకరం- ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
తుంగభద్ర డ్యామ్ 19వ గేటు శనివారం రాత్రి ఊడిపోయింది. డ్యామ్ ఇన్ ఫ్లో తగ్గడంతో రాత్రి డ్యామ్ గేట్లు మూసివేసేందుకు ప్రయత్నించారు.

Tungabhadra Dam 19th Gate Washed Away (Photo Credit : Facebook)
Tungabhadra Dam 19th Gate Washed Away : తుంగభద్ర డ్యామ్ గేట్లలో ధ్వంసమైన 19వ గేటును కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పరిశీలించారు. గేటు ధ్వంసం అవటానికి గల కారణాలను ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడం బాధాకరమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. ఈ డ్యామ్ కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. 3 రాష్ట్రాలకు వరప్రదాయిని అని తెలిపారు. తుంగభద్ర డ్యామ్ లో 60 టీఎంసీల నీరు నిల్వ ఉంచే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ధ్వంసమైన గేటుపై ఒత్తిడి పెరగడకుండా.. మిగతా గేట్ల ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వివరించారు. వీలైనంత త్వరగా గేటు పునరుద్దరణ చేస్తామని వెల్లడించారు.
తుంగభద్ర డ్యామ్ 19వ గేటు శనివారం రాత్రి ఊడిపోయింది. డ్యామ్ ఇన్ ఫ్లో తగ్గడంతో రాత్రి డ్యామ్ గేట్లు మూసివేసేందుకు ప్రయత్నించారు. దాంతో 19వ గేటు చైన్ తెగింది. గేటు తీసే సమయంలో తగిన జాగ్రత్తలు అధికారులు తీసుకోలేదు. గేటు తెగడంతో నీటి ప్రవాహం పోటెత్తింది. ధ్వంసమైన గేటుపై ఒత్తిడి తగ్గించేందుకు తుంగభద్ర డ్యామ్ 33 గేట్ల నుంచి నీరు బయటకు వదిలారు. మరోవైపు ప్రాజెక్ట్ నుంచి 60 టీఎంసీల నీరు బయటకు పంపిన తర్వాత గేటు పునరుద్దరణ పనులు చేపట్టే అవకాశం ఉంది.
”19వ నెంబర్ గేటు రాత్రి కొట్టుకుపోయింది. దీనివల్ల ఈ ఒక్క గేటు ద్వారానే 30 వేల క్యూసెక్కులకు పైగా నీరు కిందకు పోతోంది. 19వ గేటు దగ్గర ఒత్తిడి తగ్గించేందుకు డ్యామ్ మరిన్ని గేట్లు ఎత్తి దాదాపు 90 వేలకు పైగా క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. కనీసం 64 టీఎంసీల నీటినైనా నిలుపుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. గేటు కొట్టుకుపోవడం వల్ల నీటిని వృధాగా కిందకు వదలాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం, అన్నింటికి మించి ఆందోళనకరం. రైతుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. మా భవిష్యత్తు ఏంటి అని ఆయకట్టు అన్నదాతల్లో భయాందోళన నెలకొంది. సక్రమంగా ఆయకట్టుకు అందించేంత నీరు ఉన్నా.. దాదాపు 60 టీఎంసీల నీటిని కోల్పోవాల్సి వస్తోందన్న బాధ, ఆవేదన అందరిలోనూ ఉంది. సాధ్యమైనంత ఎక్కువ నీటిని డ్యామ్ లో నిల్వ చేసేలా అవసరమైన చర్యలు చేపట్టాలని మేము అధికారులను కోరాం” అని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు.
డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆ గేటుని పునరుద్దరించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది. గేటు కొట్టుకుపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతాంగం ఆవేదనలో ఉంది. ప్రత్యామ్నాయ గేటు లేకపోవడం వల్ల దాదాపు 60 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయాల్సి పరిస్థితి ఉంది. డ్యామ్ లో కేవలం 40 వేల టీఎంసీల నీరు మాత్రమే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుండి రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏపీ, కర్నాటకకు చెందిన ఇంజినీర్లు డ్యామ్ ను పరిశీలించారు.
Alos Read : తుంగభద్ర డ్యామ్‌కు పోటెత్తిన వరద.. కొట్టుకుపోయిన గేటు.. దిగువ ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు