Mgm Corona Deaths
Six died with Corona at the MGM hospital : వరంగల్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఎంజీఎం ఆస్పత్రిలో కోవిడ్ మరణ మృదంగం మోగిస్తోంది. కోవిడ్ వార్డులో చికిత్స పొందుతూ ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
కరోనా కాటుకు తెలంగాణ విలవిల్లాడుతోంది. మొదటి దశలో లేని దూకుడు సెకండ్ వేవ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య దారుణంగా పెరుగుతోంది. ఇటీవలి వరకూ వందల్లో ఉన్న కేసులు ఇప్పుడు వేలల్లోకి చేరాయి. 5వేల కేసులు నమోదయ్యే స్టేజ్‌కు పరిస్థితి చేరింది. ఏప్రిల్ ప్రారంభంలో వెయ్యి కేసులు నమోదవగా… ఇవాళ ఏకంగా 5 వేలు దాటిపోయాయి. అంటే.. తెలంగాణలో నిమిషానికి నాలుగు కొత్త కేసులు నమోదవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
తెలంగాణలో కోవిడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తొలిసారిగా 24 గంటల్లో 5వేల 93 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే కరోనాతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా 37వేల 37 యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల్లో లక్షా 29వేల 637 మందికి టెస్టులు నిర్వహించగా… అందులో 5 వేల 93 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.
ఎక్కువగా లక్షణాలు లేకుండానే ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన వారు హోం ఐసోలేషన్‌లో భారీగానే ఉన్నారు. ఇలా లెక్కకు అందకుండా రాష్ట్రంలో చాపక్రింద నీరులా కరోనా వ్యాప్తి టెన్షన్ పుట్టిస్తోంది