Corona Dead Body
Son not cremate her mother dead body : నిజామాబాద్ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కరోనా వచ్చిన వాళ్లను దూరంగా ఉంచిన ఘటనలు…. కరోనా వచ్చిన వారిపట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటనలు ఇంతవరకు చూసాం… కానీ నిజామాబాద్ లో కరోనాతో మరణించిన తల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా వెళ్లిపోయిన కొడుకు నిర్వాకం వెలుగు చూసింది.
నిజమాబాద్ జిల్లాలోని ప్రగతినగర్ సర్వజనిక్ స్మశాన వాటికకు ముగ్గురు వ్యక్తులు ఒక వృధ్దురాలి మృతదేహాన్ని తీసుకు వచ్చారు. కట్టెలు తీసుకు వస్తామని…. శవాన్ని అక్కడ ఉంచి వెళ్లిపోయారు. ఎంతసేపటికి వెళ్లిన వారు తిరిగి రాకపోయేసరికి స్మశాన వాటిక వాచ్ మెన్ కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు వృధ్దురాలి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకు తరలించారు. స్మశానంలో మృతదేహాన్ని వదిలి వెళ్లిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా మృతదేహాన్ని అక్కడ వదిలి వెళ్లిన ముగ్గురిలో వృధ్దురాలి కుమారుడు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తల్లికి కరోనా సోకి మరణించిందనే కారణంతోనే కొడుకు మృతదేహాన్ని వదిలిపెట్టి వెళ్ళినట్లు తెలుస్తోంది.