తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల వేళ ముదురుతున్న వివాదం

కాకతీయ కళాతోరణంపై, చార్మినార్‌పైన సీఎం రేవంత్‌కు ఎందుకంత కోపమని ప్రశ్నిస్తోంది విపక్ష బీఆర్ఎస్‌. జయజయహే తెలంగాణ గీతాన్ని కంపోజ్‌ చేయడానికి తెలంగాణ మ్యూజిక్‌ డైరెక్టర్లు ఎవరూ లేరా..? అంటూ తెలంగాణ సినీ మ్యూజీషియన్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం తెలిపింది.

State Anthem And Symbol : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల చుట్టూ వివాదం చెలరేగుతోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చడంతో పాటు తెలంగాణ గీతానికి కీరవాణితో మ్యూజిక్ కంపోజ్ చేయించడమే దీనికి ప్రధాన కారణం. రాజకీయ దురుద్దేశ్యంతో తెలంగాణ గుర్తులను మార్చుతున్నారని ఓ పక్క ప్రతిపక్షాలు మండిపడుతుంటే.. త్యాగాలు, పోరాటాలకు చిహ్నంగా రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. అటు గీతం.. ఇటు చిహ్నంపై దశాబ్ది సంబురాల సాక్షిగా విమర్శలు పెరుగుతున్నాయి.

తెలంగాణ అంటేనే పోరాటాలకు స్ఫూర్తి. నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా.. ప్రజలు గర్జించి ..నీళ్లు, నిధులు, నియామకాల కోసం గళమెత్తి సాధించుకున్న ఉద్యమ చరిత్ర. దశాబ్దాల కల నెరవేరి.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగి పదేళ్లవుతోంది. దీంతో రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూన్‌ 2న అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నివాళులర్పించి.. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు.

తెలంగాణ మ్యూజిక్‌ డైరెక్టర్లు ఎవరూ లేరా..?
అక్కడే రాష్ట్ర ప్రత్యేక గీతాన్ని, రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని నూతనంగా ఆవిష్కరించనున్నారు. ప్రముఖ తెలంగాణ కవి అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు చేయించి గీతానికి సంగీతాన్ని కంపోజ్‌ చేస్తోంది. ఈ బాధ్యతల్ని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి అప్పగించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. తెలంగాణ గీతాన్ని మళ్లీ కంపోజ్‌ చేయడం దేనికనే ప్రశ్నలు బయల్దేరాయి. అంతేకాక కీరవాణి స్వరాలు సమకూర్చడంపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జయజయహే తెలంగాణ గీతాన్ని కంపోజ్‌ చేయడానికి తెలంగాణ మ్యూజిక్‌ డైరెక్టర్లు ఎవరూ లేరా..? అంటూ తెలంగాణ సినీ మ్యూజీషియన్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం తెలిపింది. దీనిపై డైరెక్టర్‌ ప్రేమ్‌రాజ్‌ .. గీత రచయిత అందెశ్రీకి ఫోన్‌ చేసి తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు అందెశ్రీ.

కాకతీయ కళాతోరణంపై, చార్మినార్‌పైన సీఎం రేవంత్‌కు ఎందుకంత కోపం?
మరోవైపు తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు, చేర్పులు చేస్తోంది రేవంత్‌ సర్కార్‌. రాష్ట్ర చిహ్నంలో ఉన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగిస్తున్నారు. దీనికోసం నిజామాబాద్‌కు చెందిన కళాకారుడికి తెలంగాణ చిహ్నం రూపకల్పన బాధ్యతను అప్పగించారు. దీనిపైనా దుమారం రేగుతోంది. తెలంగాణ గీతం, చిహ్నంలో మార్పులు చేర్పులపై విపక్ష బీఆర్ఎస్‌ మండిపడుతోంది. కాకతీయ కళాతోరణంపై, చార్మినార్‌పైన సీఎం రేవంత్‌కు ఎందుకంత కోపమని ప్రశ్నిస్తోంది విపక్ష బీఆర్ఎస్‌.

రేపు తెలంగాణ సరిహద్దులు చెరిపేస్తారా?
అధికారిక గీతంలో కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్‌ను కీర్తించి.. అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా..? అని విమర్శించారు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. చార్మినార్‌ కేవలం ఒక కట్టడం కాదని.. విశ్వనగరమైన హైదరాబాద్‌కు ఇదో ఐకాన్‌ అన్నారు. ఇవాళ తెలంగాణ గుర్తులు మార్చి రేపు తెలంగాణ సరిహద్దులనూ చెరిపేస్తారా..? అంటూ ఎక్స్‌లో విమర్శించారు. శతాబ్దాల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలుగా ఉన్న వాటిని తొలగిస్తారా..? అని అన్నారు. జయజయహే తెలంగాణ గీతంలో అసలు ఏముందో తెలుసా..? అని ప్రశ్నించారు.

కీరవాణి పెత్తనం ఏంటి?
తెలంగాణ గీతంపై ఆత్మగౌరవ రాగం ఆలపిస్తోంది బీఆర్ఎస్‌. తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతాన్ని అందించడంపై BRS నేత RS ప్రవీణ్‌ కుమార్‌ అభ్యంతరం తెలిపారు. అందెశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి పెత్తనం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడిచాక.. గీత స్వర కల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరమొచ్చిందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఉన్న చిహ్నంలో కాకతీయ కళాతోరణాన్ని తొలగించడాన్ని వరంగల్ జిల్లా ప్రజలు, నేతలు వ్యతిరేకిస్తున్నారు. చార్మినార్‌ను తొలగించడాన్ని ఎంఐఎం తీవ్రంగా తప్పుబడుతోంది.

తెలంగాణవాదులు, మేధావులు, మానవ హక్కుల నాయకులు మాత్రం దీన్ని స్వాగతిస్తున్నారు. పదేళ్ల తర్వాత అయినా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ఆవిష్కరిస్తుండటం సంతోషకరమైన విషయమని అంటున్నారు. అందెశ్రీ రాసిన తెలంగాణ గీతాన్ని రాష్ట్రగీతంగా చేయడం చాలా సంతోషకరమని మేధావులు, తెలంగాణకు చెందిన మేధావులు, మానవ హక్కుల నాయకులు అంటున్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు.

అంతా అందెశ్రీ ఇష్టం..
తెలంగాణ రాష్ట్ర గీతం, చిహ్నం మార్పులపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. గీతం రూపకల్పన బాధ్యతలు అందెశ్రీకి ఇచ్చానన్నారు. అందెశ్రీ ఎవరిని ఎంచుకుని గేయానికి సంగీత రూపకల్పన చేస్తారనేది ఆయన ఇష్టమన్నారు. ఏ సంగీత దర్శకుడితో గేయం రూపకల్పన చేయాలనేది తన పని కాదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. గేయ రూపకల్పన బాధ్యత అంతా అందెశ్రీదేనన్న రేవంత్ రెడ్డి.. కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు.

తెలంగాణ గీతం, రాష్ట్ర చిహ్నం చుట్టూ రాజకీయ వివాదాలు రచ్చకెక్కుతుంటే.. సీఎం రేవంత్‌ ప్రభుత్వం తనపని తాను చేసుకువెళ్తోంది. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఎంపిక తుది దశకు చేరుకుంది. చిత్రకారుడు రుద్ర రాజేశం గీసిన పలు నమూనాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒక నమూనాను ఎంపిక చేశారు. ఈ నమూనా తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ పోరాటం, ఉద్యమకారుల త్యాగాలను ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనుందని సమాచారం. మొత్తానికి జూన్‌ 2న తెలంగాణ గీతం, రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణతో ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందన్నది ఉత్కంఠగా మారింది.

Also Read : నన్ను బెదిరించారు..! సీఎం రేవంత్ రెడ్డి నెంబర్ ఇచ్చేశా- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

ట్రెండింగ్ వార్తలు