ఎన్నికల వేళ ఎడాపెడా హామీలు.. కర్ణాటక బడ్జెట్ చెబుతున్న పాఠమేంటీ? తెలుగు రాష్ట్రాలు నేర్చుకోవాల్సింది ఏంటీ?

Debts: ఇటు ఆంధ్రప్రదేశ్‌, అటు తెలంగాణ రాష్ట్రాలు రెండూ ఇప్పటికే భారీగా పేరుకుపోయిన అప్పులతో సతమతమవుతున్నాయి.

ఎన్నికల కోసం ఎడాపెడా హామీలు ఇచ్చి.. ఆ తర్వాత వాటిని అమలు చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో.. ఆర్థికంగా ఎంత ఒత్తిడి ఎదురవుతుందో… కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 రాష్ట్ర బడ్జెట్‌ కళ్లకు కట్టినట్లు వెల్లడి చేస్తోంది. మూడు లక్షల 71 వేల కోట్ల రూపాయల వ్యయంతో కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కోసం నిధుల సమీకరణలో భాగంగా దాదాపు లక్షా ఐదు వేల కోట్ల రూపాయలను అప్పుల రూపేణా సమీకరించుకోవాల్సిన పరిస్థితి కర్నాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురయ్యింది. అంటే బడ్జెట్‌లో 28% మొత్తాన్ని అప్పు చేసి తెచ్చుకోవాల్సి వచ్చింది.

కర్నాటక ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు లక్షా 20 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో లక్షా 5 వేల కోట్ల రూపాయలను అప్పుగా తేవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో సంక్షేమ పథకాల అమలు ఎంత కష్టతరం కాబోతోందో ఇట్టే అర్థం అవుతోంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే 4 లక్షల 35 వేల కోట్ల రూపాయల అప్పు ఉంది. దీనికి కొత్తగా తీసుకు రానున్న అప్పులు అదనం. ఈ ఏడాదికి ఏదో విధంగా అప్పులు తీసుకు రాగలిగినా, వచ్చే సంవత్సరాల్లో ఇది సాధ్యం అవుతుందా అనే ప్రశ్న ఉత్పన్నం కాకమానదు.

కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 44 వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి అప్పుగా తెచ్చిన మొత్తం 85 వేల కోట్ల రూపాయలుగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను లక్షా 5 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకురానున్నారు. ఇలా ప్రతి ఏటా తీసుకురావాల్సిన అప్పులు పెరిగిపోతుంటే… అప్పు పుట్టే పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

తెలుగు రాష్ట్రాల పరిస్థితి?
గడచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా… కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఎడాపెడా హామీలు ఇచ్చిందని, తెలంగాణలోనూ ఇదే ఒరవడి కొనసాగించారని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ అక్కడ కూడా ఎడాపెడా హామీలు గుప్పించనున్నారనే విస్తృత చర్చ జరుగుతున్న సందర్భంలో.. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడం మున్ముందు ఇబ్బందికరంగా మారనుందనే చర్చ ఇప్పటికే మొదలయ్యింది.

ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయితే.. మరో అడుగు ముందుకు వేసి ఎన్నికల హామీలపై కొత్త చర్చకు తెరదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో తాను ఇప్పుడు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా దాదాపు 53 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని.. ఈ నిధులు సమీకరించుకోవాలంటేనే తలప్రాణం.. తోకలోకి వస్తోందని జగన్మోహన్‌రెడ్డి బహిరంగంగానే చెప్పారు.

ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కొత్తగా చెబుతున్న వాగ్దానాలను అమలు చేయాలంటే ఏటా మరో 73 వేల కోట్ల రూపాయలు కావాలని, అంటే ఇప్పటికే ఉన్న వాటికి తోడు… కొత్తవి అమలు చేయడానికి ఏడాదికి మొత్తం లక్షా 26 వేల కోట్ల రూపాయలు కావాలని, వీటిని ఎక్కడి నుంచి తెస్తారని జగన్‌ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే 7 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు ఉన్న నేపథ్యంలో.. జగన్‌ లేవనెత్తుతున్న ప్రశ్న కొత్త చర్చకు దారితీస్తోంది.

ఎడాపెడా హామీలు
ఎన్నికల సందర్భంగా ఎడాపెడా హామీలు ఇచ్చుకుంటూ పోతే… వాటిని అమలు చేయడానికి నిధులు ఎలా ? అప్పులతో ఎంతకాలం నిధులు సమీకరించగలుగుతారు ? హామీలు తలకు మించిన భారంగా మారి చివరకు చేతులెత్తేయాల్సిన పరిస్థితి రాదా ? అదే జరిగితే.. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి రియాక్షన్‌ ఎలా ఉంటుంది ? దీనికి ముగింపు ఎలా ఉండనుంది ? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే కర్ణాటక రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన అప్పుల సమీకరణ అంశం మిగిలి రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించేలా ఉంది.

ఏటేటా చేస్తున్న అప్పుల విషయానికి వస్తే… ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 77 వేల కోట్ల రూపాయల అప్పులు చేయగా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి 86 వేల 612 వేల కోట్ల రూపాయల అప్పులు తేవాల్సి ఉంటుందని అంచనా వేశారు. తెలంగాణ ప్రభుత్వం విషయానికి వస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు 43 వేల 115 కోట్ల రూపాయల అప్పులు తీసుకురాగా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి 64 వేల 525 కోట్ల రూపాయల అప్పు తీసుకురావాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్‌, అటు తెలంగాణ రాష్ట్రాలు రెండూ ఇప్పటికే భారీగా పేరుకుపోయిన అప్పులతో సతమతమవుతున్నాయి.

రానున్న సంవత్సరాల్లో ఈ అప్పుల భారం పెరిగిపోయి… కొత్త అప్పులు పుట్టడం రాష్ట్ర ప్రభుత్వాలకు కష్టమవుతుందనే అభిప్రాయం ఉంది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం… ఆర్థిక క్రమశిక్షణ కోసం కొత్త నిబంధనలు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. రాష్ట్ర ప్రభుత్వాలకు నిధుల పరంగా ఎదురయ్యే పరిస్థితిని ఊహించుకోవడమే కష్టంగా ఉంటుంది.

అందుకే… తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హామీల విషయంలో కనుక రాజకీయ పార్టీలు నేల విడిచి సాము చేస్తే… ఆర్థిక ఇబ్బందులు భరించలేని స్థాయికి వస్తాయన్నది సుస్పష్టం.

Read Also : దూసుకుపోతున్న హైదరాబాద్ ఆస్తుల విలువ

ట్రెండింగ్ వార్తలు