MLC Kavitha
Liquor Scam Case : ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడం చట్టవిరుద్దం అంటూ కవిత దాఖలు చేసిన పిటీషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించింది. అయితే, బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. పిటిషన్ లో లేవనెత్తిన ఇతర అంశాలపై విచారణకు అంగీకరించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా బదులివ్వాలని కోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇటీవల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈడీ అధికారులు ఆమెను గత ఐదురోజులుగా విచారణ జరుపుతున్నారు.
Also Read : Mlc Kavitha Interrogation : వాళ్లిద్దరితో కుమ్మక్కయ్యారా? ఎమ్మెల్సీ కవితపై ఈడీ ప్రశ్నల వర్షం
కవిత పిటీషన్ పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సూచించింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని, సుప్రీంకోర్టును ఆశ్రయించే అంత ఆర్ధిక స్థోమత ఉన్నంత మాత్రన మీ పిటీషన్‌ను పరిగణనలోకి తీసుకోలేమని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలను ఇప్పటికే దాఖలైన విజయ్ మదన్ లాల్ కేసుకు జత చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం.. బెయిల్ తాము ఇవ్వలేమని, ఎవరైనా కింది కోర్టును మొదట ఆశ్రయించాల్సిందేనని స్పష్టం చేసింది.
Also Read : టీడీపీ మూడో జాబితా విడుదల.. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
కవిత తరపున కపిల్ సిబల్, విక్రమ్ చౌదరిలు వాదనలు వినిపించారు. ఈడీ వ్యవహరించిన తీరు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తనని తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురి చేస్తున్నాయని కవిత తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎమోషన్ కు గురికావద్దని వారించారు. ఈ కేసులో ఒకసారి సాక్షిగా, మరోసారి నిందితురాలిగా విచారించారని, ఒక్క బలమైన సాక్ష్యం కూడా లేదని, అంతా అప్రూవర్ గా మారి ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు సాగుతోందని కపిల్ సిబల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ప్రస్తుతం తాము కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. పిటిషన్‌లో రాజ్యాంగ పరమైన విషయాలను లేవనెత్తారని, వాటిపై మిగతా పిటిషన్లతో కలిపి విచారిస్తామని పేర్కొన్నారు. కేసు మెరిట్స్ గురించి ట్రయల్ కోర్టుకే చెప్పాలని స్పష్టం చేశారు.
బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్చ పిటిషనర్‌కు ఉందని, త్వరిత గతిన కేసు విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టుకు ధర్మాసనం సూచించింది. రాజ్యాంగ పరమైన అంశాలపై ఈడీకి త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో సమాధానం చెప్పాలని, తర్వాత మరో రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఈడీని ఆదేశించింది.