Supreme Court
CM Revanth Reddy: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బుధవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, గురువారం మరోసారి రేవంత్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చాయి.
పార్టీలు మారినా ఉప ఎన్నికలురావు అంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బుధవారం విచారణలో జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ తరహా వ్యాఖ్యలను ఉపేక్షించబోమని, అవసరమైతే కోర్టు ధిక్కారంగా భావించాల్సివస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం విచారణ సందర్భంగా మరోసారి రేవంత్ చేసిన వ్యాఖ్యలను సుప్రీం ధర్మాసనం ప్రస్తావించింది.
Also Read: Inter Results: ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్.. పేపర్ దిద్దే విషయంలో కొత్త నిర్ణయం
గతంలో చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా?
గతంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆ సమయంలో తాము కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయకుండా ఉండటం ద్వారా తప్పు చేశామా అనే భావన వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. గతంలో లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ సమయంలో టీఆర్ఎస్, బీజేపీ అవగాహనలో భాగంగానే బెయిల్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం విధితమే. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు సంయమనం పాటించాలని జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం సూచించింది. ఆ సమయంలో న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కలుగజేసుకొని ప్రతిపక్షం నుంచి అంతకుమించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి మాట్లాడిన పూర్తి స్క్రిప్టును తాను అందజేస్తానని కోర్టుకు తెలిపారు. జరిగినదానికి సంబంధించిన పూర్తి కార్యకలాపాల నివేదికను అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది.
రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
మార్చి 26వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలెవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వచ్చే వారమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నేతలు ఊదరగొడుతున్నారు. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. గత బీఆర్ఎస్ హయాంలో ఉన్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉంది. స్పీకర్ వ్యవస్థ, చట్టం అవే ఉన్నాయి. ఏవీ మారలేదు. అలాంటప్పుడు అప్పుడు పార్టీలు మారిన నేతల విషయంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని వ్యాఖ్యానించారు.