TSRTC Bill : ఆర్టీసీ బిల్లుపై కొనసాగుతున్న సస్పెన్స్.. గవర్నర్ తమిళిసై హాట్ కామెంట్స్

ఆర్టీసీ యూనియన్ స్ట్రైక్ కు పిలునివ్వలేదని జేఏసీ నేతల్లో ఒకరు చెప్పారన్న గవర్నర్.. ప్రభుత్వం బలవంతంగా చేయించిందని ఆరోపించారు. Tsrtc merger bill

TSRTC Bill

Tamilisai Soundararajan : టీఎస్ఆర్టీసీ బిల్లుపై(TSRTC Bill) సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశంలో హైడ్రామాకు ఇంకా తెరపడలేదు. ఆర్టీసీ బిల్లుకు రాజ్ భవన్ లో పీటముడి పడింది. ప్రభుత్వం పంపిన ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Dr Tamilisai Soundararajan ) ఇంకా ఆమోదం తెలపలేదు. ఈ బిల్లుకు సంబంధించి గవర్నర్ తమిళిసై మరికొన్ని సందేహాలు లేవనెత్తారు. ఆర్టీసీ విలీనానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతి తీసుకుందా? అని ప్రశ్నించారామె. ఆర్టీసీలో 30శాతం వాటా కేంద్రానికి ఉందన్న గవర్నర్.. కేంద్ర సమ్మతిని జత చేయాలని కేసీఆర్ ప్రభుత్వానికి చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తర్వాత కార్పొరేషన్ నిధులను ఏం చేస్తారు? ఆర్టీసీ ఆస్తులు కార్పొరేషన్ పరిధిలో ఉంటాయా? లేదా? తెలపాలన్నారు.

ఇక ఈ వ్యవహారంపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల కోసమే ప్రభుత్వాన్ని వివరణ కోరినట్లు గవర్నర్ తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయకోణం లేదని ఆమె స్పష్టం చేశారు. హడావిడిగా బిల్లును ప్రవేశపెట్టొదన్న గవర్నర్.. ఉద్యోగుల క్షేమం గురించి ప్రభుత్వాన్ని వివరణ కోరుతున్నామన్నారు. ఆర్టీసీ యూనియన్ స్ట్రైక్ కు పిలునివ్వలేదని జేఏసీ నేతల్లో ఒకరు చెప్పారన్న గవర్నర్.. ప్రభుత్వం బలవంతంగా చేయించిందని ఆరోపించారు.

Also Read..Neopolis Layout Kokapet: అందరి దృష్టి కోకాపేటపైనే.. అసలు నియోపోలిస్ అంటే అర్థం ఏంటి?

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుపై ఉత్కంఠ నెలకొంది. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టుందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి. అయితే, ఆ బిల్లుకు ఇంకా గవర్నర్ ఆమోదం తెలపలేదు. అసలు, గవర్నర్ ఆ బిల్లుకు ఆమోదముద్ర వేస్తారా? లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది. దీనిపై ఉదయం నుంచి ఒక హైడ్రామా నడిచింది. హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బిల్లుకు సంబంధించి గవర్నర్ ఐదు అంశాలను లేవనెత్తారు. ఆ ఐదింటికి కేసీఆర్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీంతో బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపుతారని అంతా అనుకున్నారు.

కానీ, గవర్నర్ తమిళిసై ట్విస్ట్ ఇచ్చారు. మరో 3 అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు గవర్నర్. ఆ మూడింటిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇంకా రాజ్ భవన్ కు సమాచారం ఇవ్వలేదు. ఆర్టీసీకి ఉన్న ఆస్తులు ఎన్ని? అన్న దానిపై గవర్నర్ వివరణ కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో ఆర్టీసీకి దాదాపు 80వేల కోట్ల రూపాయలకుపైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన సమాచారాన్ని డ్రాఫ్ట్ బిల్లులో ప్రభుత్వం ప్రస్తావించలేదు. దాంతో దానిపై గవర్నర్ ప్రశ్నించారు.

ఆర్టీసీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఎన్ని భవనాలు ఉన్నాయి? ఎన్ని ఎకరాలు ఉన్నాయి? అన్నదానిపై సమగ్రమైన సమాచారం ఇవ్వాల్సిందిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు ఉద్యోగుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దానికి సంబంధించి కూడా వివరణ ఇవ్వాలని గవర్నర్ కోరారు.

Also Read..Jagga Reddy: జగ్గారెడ్డి బీఆర్‌ఎస్‌లోకి జంప్ చేస్తారా.. కేటీఆర్‌తో భేటీ అందుకేనా?

ఆర్టీసీలో 43వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వారి పూర్తి వివరాలు అంటే డిపోల వారిగా ఎంతమంది ఉద్యోగులు ఉన్నారని వివరణ కోరారు తమిళిసై. ప్రస్తుతం ఆర్టీసీలో పర్మినెంట్ కాని ఉద్యోగులు ఉన్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ఆ ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తారా? అన్నదానిపై వివరణ కోరారు గవర్నర్. వీటికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం నుంచి ఇంకా రాజ్ భవన్ కు చేరలేదు. దీంతో బిల్లుకు ఆమోదముద్ర వేయలేదు గవర్నర్ తమిళిసై.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్థికపరమైన బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం కోసం పంపింది. కానీ, గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోకపోవడంతో బిల్లును అసెంబ్లీ ముందుకు తేలేదు. ఇందులో రాజకీయ కోణం ఉందని, గవర్నర్ కావాలనే బిల్లును ఆమోదించడం లేదంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై రాజ్ భవన్ వర్గాలు స్పందించాయి. బిల్లును ఆమోదించడానికి కొంత సమయం పడుతుందని, న్యాయపరమైన అంశాలు పరిశీలించాల్సి ఉందన్నారు.

ట్రెండింగ్ వార్తలు