Chandrababu On KCR Health
తుంటి గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సోమవారం(డిసెంబర్ 11) హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు.. కేసీఆర్ తో మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి స్వయంగా కేసీఆర్ ని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. అటు కేసీఆర్ కు అందుతున్న ట్రీట్ మెంట్ గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
Also Read : ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాకు అసలు కారణాలు అవేనా..? ఏదైనా వ్యూహం ఉందా
ఒక్కోసారి జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు అన్నారు. కేసీఆర్ తొందరలోనే కోలుకుంటారని చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, మళ్లీ ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు చంద్రబాబు. డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం కేసీఆర్ తొందరలోనే కోలుకుంటారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మామూలుగా తిరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, మళ్లీ అంకితమైన భావంతో ప్రజల కోసం పని చేయాలని చంద్రబాబు కోరుకున్నారు.
కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. మూడు రోజుల క్రితం ఆయనకు యశోద ఆసుపత్రిలో వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ థియేటర్ నుంచి కేసీఆర్ ను ఐసీయూకి షిఫ్ట్ చేశారు. కేసీఆర్ ను కలిసి పరామర్శించేందుకు కేవలం వీఐపీలకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ ఉదయం నుంచి కేసీఆర్ ను పలువురు మాజీ మంత్రులు పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
Also Read : యశోద ఆస్పత్రిలో ఆసక్తికర ఘటన.. రేవంత్ అన్న అంటూ పిలిచిన మహిళ.. సీఎం ఏం చేశారంటే.. వీడియో వైరల్
కాగా, ఆసుపత్రి చికిత్స పొందుతున్న కేసీఆర్ ను ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని 9వ ఫ్లోర్ లో కేసీఆర్ కు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. కేసీఆర్ ను రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి(డిసెంబర్ 13) ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.