Teenmar Mallanna Attacked: తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి.. ఇరువర్గాలపై కేసు నమోదు

తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు.

Teenmar Mallanna Attacked: తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి కేసులో పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. మల్లన్న ఇచ్చిన ఫిర్యాదుతో జాగృతి కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక జాగృతి నాయకుడు లింగమయ్య ఇచ్చిన ఫిర్యాదుతో తీన్మార్ మల్లన్న పైనా కేసు నమోదు చేశారు పోలీసులు.

ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) కార్యాలయంపై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. జరిగింది. జాగృతి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జాగృతి కార్యకర్తలు మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి దిగారు. అప్రమత్తమైన మల్లన్న గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కి వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపేశారు.

కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారని జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ దాడిపై మల్లన్న స్పందించారు. తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపాడని అన్నారు.

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నను అరెస్ట్ చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆమె ఫిర్యాదు చేశారు. తీన్మార్‌ మల్లన్నను అరెస్ట్ చేయకపోతే సీఎం రేవంత్‌ రెడ్డిని కూడా అనుమానించాల్సి వస్తుందన్నారు కవిత. ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడేందుకు వస్తే కాల్పులు జరుపుతారా? అని ప్రశ్నించారు. ఒక మహిళ ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారని కవిత ధ్వజమెత్తారు. తీన్మార్‌ మల్లన్న ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని కవిత తేల్చి చెప్పారు.

”అసలు ఆయన ఎవరు? నేనేమీ అనకముందే ఆయన నాపై కామెంట్స్‌ చేస్తున్నారు. అసలు నాపై ఎందుకు కామెంట్ చేయాలి? ఆయన అడగాల్సింది ప్రభుత్వాన్ని? సర్కార్ ని అడగకుండా నన్ను అడ్డుకుంటానని అంటున్నారు. ఇవాళ చూశారు కదా ఏం జరిగిందో.. ఆయన ఎవరో ఆయన సంగతి ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. నేనెవరో నా సంగతి ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు” అని కవిత ధ్వజమెత్తారు.