Sharmila: షర్మిల ఔట్‌.. కోదండరామ్‌ ఇన్‌.. గెలుపే టార్గెట్‌గా కాంగ్రెస్‌ ఎత్తుగడలు!

షర్మిలను వద్దన్న కాంగ్రెస్‌ కోదండరామ్‌పై అంత ఇంట్రెస్టు చూపడానికి కారణమేంటి? హస్తం పార్టీ వ్యూహం ఎలా ఉంది..?

congress closed doors to sharmila welcome kodandaram

Telangana Congress: అసెంబ్లీ ఎన్నికలకు ఆచితూచి అడుగులేస్తోంది కాంగ్రెస్‌. తన ప్రధాన ప్రత్యర్థి.. సీఎం కేసీఆర్‌కు ఏమాత్రం చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల ముందు పార్టీలో చేరేందుకు వస్తున్న అందరికీ రెడ్‌కార్పెట్‌ స్వాగతం పలికిన హస్తం పార్టీ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ కుమార్తె.. YSRTP అధినేత్రి షర్మిలకు మాత్రం రెడ్‌ సిగ్నల్‌ వేసేసింది.. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోదండరామ్‌తో పొత్తు కోసం విశేష ప్రాధాన్యం ఇస్తోంది. షర్మిలను వద్దన్న కాంగ్రెస్‌ కోదండరామ్‌పై అంత ఇంట్రెస్టు చూపడానికి కారణమేంటి? హస్తం పార్టీ వ్యూహం ఎలా ఉంది..?

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా కాంగ్రెస్‌ అనేక ఎత్తుగడలు వేస్తోంది. ఇన్నాళ్లు తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలను ఒక్కొక్కటిగా తీస్తోంది. మాటల మాంత్రికుడు.. తెలంగాణ ఉద్యమానికి చాంపియన్‌గా నిలిచే సీఎం కేసీఆర్‌కు చెక్‌ చెప్పటానికి ఉద్యమ నేత కోదండరామ్‌కు గాలం వేస్తోంది. ఈ ఎన్నికల్లో కోదండరామ్‌ పార్టీ తెలంగాణ జనసమితితో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది కాంగ్రెస్‌. కోదండరామ్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించి.. ఆయన పోటీచేసే స్థానంలో తన పార్టీ అభ్యర్థిని నిలబెట్టకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయానికి కోదండరామ్ మద్దతు తీసుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్‌. ఐతే కోదండరామ్‌ తన స్థానంతోపాటు తన అనుచరులు పోటీ చేసే మరికొన్ని స్థానాలు కేటాయించాలని కోరుతున్నట్లు చెబుతున్నారు.

కోదండరామ్‌ పార్టీతో పొత్తుకు లైన్‌క్లియర్‌!
ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ కోదండరామ్‌ పార్టీతో కాంగ్రెస్‌ పొత్తుకు లైన్‌క్లియర్‌ అయినట్లే కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌.. తెచ్చిన నాయకుడిగా కోదండరామ్‌ను చూపుతూ ఇమేజ్‌ బిల్డప్‌ చేసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ… సీఎం కేసీఆర్‌ వ్యూహాలకు చిక్కకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందనేదానికి ఇదో ఉదాహరణగా చెబుతున్నారు పరిశీలకులు. కోదండరామ్‌తో పొత్తుకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన కాంగ్రెస్‌.. అదే సమయంలో పార్టీతో ఎంతో అనుబంధం ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ కుమార్తె షర్మిలకు మాత్రం మొండిచెయ్యే చూపడం హాట్‌టాపిక్‌ అవుతోంది.

షర్మిల చేరికకు బ్రేక్‌
తన పార్టీ వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి షర్మిల ఎంతో ప్రయత్నించారు. ఆమె చేరితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉచ్చులో చిక్కుకున్నట్లేనని భావించిన రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు.. ముఖ్యంగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి షర్మిల చేరికకు అడ్డుకట్ట వేశారు. ఆంధ్రా నాయకురాలిగా షర్మిలను చూపి ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయావకాశాలను సీఎం కేసీఆర్‌ దెబ్బతీసే అవకాశం ఉందనే కారణం అధిష్టానం ముందుంచినట్లు తెలుస్తోంది. ఆ విధంగా షర్మిల చేరికకు బ్రేక్‌ వేశారు రేవంత్‌రెడ్డి.

కోదండరామ్‌ పోటీ ఖాయం..
ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక వహించిన కోదండరామ్‌ను చేర్చుకుని టికెట్‌ ఇవ్వడం ద్వారా ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యమిస్తున్నామనే సంకేతాలు పంపాలని నిర్ణయించింది కాంగ్రెస్‌. అటు షర్మిల చేరికకు బ్రేక్‌ వేస్తూ.. ఇటు కోదండరామ్‌ వ్యవహారంలో చురుగ్గా వ్యవహరించిన రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు పక్కా స్ర్టాటజీ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్‌ టికెట్‌పైగాని.. లేదంటే కాంగ్రెస్‌ మద్దతుతో తెలంగాణ జనసమితి నుంచి గాని కోదండరామ్‌ పోటీ ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో తనతోపాటు తన అనుచరులు మరికొందరికి కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసం కోదండరామ్‌ పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు.

Also Read: మళ్లీ రేసులోకి జానారెడ్డి.. సీఎం పీఠంపైనే పెద్దాయన గురి!

కాంగ్రెస్‌ అగ్రనేతలు గాంధీ కుటుంబం మొత్తం షర్మిల చేరికకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా రాష్ట్ర పార్టీ బ్రేక్‌లు వేయడంపై విస్తృత చర్చ జరుగుతోంది. తెలంగాణలో రాజకీయాలు చేద్దామని ఆశించిన షర్మిల.. తన ఆశలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ సహకారం ఉండాలని కోరుకోవడం.. పార్టీ అగ్రనేతలు అంగీకరించినా… రాష్ట్ర నేతలు ఝలక్‌ ఇవ్వడంపై జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించి తానే సీఎం అవుతానని ప్రకటించిన షర్మిల.. కాంగ్రెస్‌ అండదండలతో ఆ కోరిక తీర్చుకోవాలని పావులు కదిపితే.. ఆమె చేరికనే రాష్ట్ర నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో సొంతంగా పోటీకి సిద్ధమవుతున్నారు షర్మిల.

Also Read: ఆ రెండు ఎన్నికల్లో సక్సెస్.. అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న కేసీఆర్‌!

కేసీఆర్‌ వల్లే రెండో సీటుకు షర్మిల పోటీ
ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ సీటు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తానని గతంలో ప్రకటించిన షర్మిల.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ వల్లే రెండో సీటుకు పోటీ చేయాలని నిర్ణయించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీ చేయాలని డిసైడ్‌ అయినట్లు తాజా సమాచారం. మొత్తానికి కాంగ్రెస్‌ హ్యాండిచ్చినా.. 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలబెట్టాలని తన పంతం నెగ్గించుకోడానికి తాను స్వయంగా రెండు చోట్ల పోటీకి దిగాలనుకుంటున్నారు షర్మిల. అంతే కాకుండా.. మిగిలిన అభ్యర్థుల జాబితాను ఒకేసారి విడుదల చేయడానికి చురుగ్గా పావులు కదపడమే హాట్‌టాపిక్‌ అవుతోంది. కాంగ్రెస్‌ చేతిలో భంగపడిన షర్మిల అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతారనేదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు