Telangana Congress CM Candidates
Telangana Congress CM Candidates : అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ను ఢీకొట్టి కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెంచుకుంటున్న నాయకుల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. తాము అధికారంలోకి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయని నమ్ముతున్న కాంగ్రెస్ నేతలు పలువురు సీఎం కుర్చీపై కర్చీఫ్ వేసేందుకు రెడీ అవుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు?
కాంగ్రెస్ లో సీఎం పదవిని ఆశించే ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. సీఎం పోస్టుపై రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఇంకా ఈ రేసులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కీలు కూడా ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ తమకు అధికారం వస్తుందని కాంగ్రెస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న చర్చ ఆ పార్టీలో గట్టిగానే సాగుతోంది. ఎవరికి వారు తనకు సీఎం కుర్చీ దక్కుతుందంటే తనకే దక్కుతుందని ఆశలు పెట్టుకుంటున్నారు. ఇలా హస్తం పార్టీలో ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య అరడజను వరకు ఉంది.
Also Read : అసెంబ్లీ బరిలోకి దిగమంటున్న బీజేపీ సీనియర్లు.. వారిద్దరికి మినహాయింపు!
సీఎం పదవి తనకే దక్కుతుందని రేవంత్ రెడ్డి గట్టి నమ్మకం..
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదలు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వరకు చాలా మంది సీఎం రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకే ముఖ్యమంత్రి ఛాన్స్ వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఊపు తేవడానికి వెనుక తాను చేసిన కృషిని పార్టీ అధిష్టానం కచ్చితంగా గుర్తిస్తుందని, రాష్ట్రంలో ప్రధాన సామాజికవర్గానికి చెందిన తనకు సీఎం పదవి లభిస్తుందని ఆశిస్తున్నారు రేవంత్. అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆశీస్సులు తనకు అనుకూలం అని విశ్వసిస్తున్నారు రేవంత్ రెడ్డి.
తనను వ్యతిరేకించే వారు ఎవరూ లేరన్న నమ్మకంలో భట్టి..
సీఎం పదవిపై గట్టి ఆశ, అవకాశం ఉన్న వారిలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేరు వినిపిస్తోంది. వివాదరహితుడిగా, హుందాగా వ్యవహరించే నాయకుడిగా భట్టికి ఉన్న గుర్తింపు, విద్యాదికుడు కావడం, తొలి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పని చేయడం, దళితవర్గానికి చెందిన నేత కావడం తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు మల్లు భట్టి విక్రమార్క. రాష్ట్ర కాంగ్రెస్, జాతీయ స్థాయిలో కానీ తనను వ్యతిరేకించే వారు ఉండరు అనే నమ్మకంలో ఉన్నారు భట్టి. ఇదే తనకు ప్లస్ పాయింట్ అవుతుందని నమ్ముతున్నారాయన.
తనలాంటి పెద్దలకే సీఎం పదవి దక్కుతుందన్న ఆశలో జానారెడ్డి..
ఇక సీనియర్ నేత జానారెడ్డి అయితే సీఎం పదవి తనను వెతుక్కుంటూ వస్తుందని బహిరంగంగానే చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలన నిర్ణయించుకున్న జానారెడ్డి ఇప్పడు మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీలో సీఎం కుర్చీపై పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు తనలాంటి పెద్దలకే సీఎం పదవి లభించే అవకాశాలు ఉంటాయని, అధిష్టానం పెద్దలకు తనపట్ల ఎంతో గౌరవ భావాలు ఉన్నాయని, సోనియా గాంధీకి తన పట్ల మంచి అభిప్రాయం ఉందని జానారెడ్డి విశ్వసిస్తున్నారు.
Also Read : ఈటల సతీమణి జమున రాజకీయ ఆరంగేట్రం చేస్తారా?
ఇవన్నీ తనకు కలిసి వచ్చి సీఎం కుర్చీ నడుచుకుంటూ వస్తుందని ఆయన ఆశ పడుతున్నారు. అవసరమైతే కొడుకు ఎమ్మెల్యేగా గెలిచాక రాజీనామా చేయించి తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తానని అంటున్నారు జానారెడ్డి.
సోనియాపై ఆశలు పెట్టుకున్న ఉత్తమ్..
వీరితో పాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీతో దీర్ఘకాలిక అనుబంధం, ప్రధానంగా సోనియా గాంధీ తనకు వివిధ సందర్భాల్లో ఇచ్చిన భరోసా, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో తనకు సభ్యత్వం కల్పించిన తీరు, పార్టీ అధినాయకత్వానికి తనమీదున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని, ఆ నమ్మకం వమ్ము కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు.
రేసులో కోమటిరెడ్డి, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్..
పైకి చెప్పడం లేదు కానీ, తమకు పెద్ద అవకాశం వస్తే బాగుంటుందని ఆశిస్తున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో కనీసం మరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి వారితో పాటు బీసీ కోటాలో మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్లు ఈ కోవలో ఉన్నారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? వస్తే సీఎం కుర్చీ ఎవరికి దక్కుతుంది? అనే సస్పెన్స్ వీడాలంటే డిసెంబర్ 3వరకు వేచి చూడాల్సిందే.