Telangana Assembly : రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు శనివారం ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగైదు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే, అసెంబ్లీ, మండలిలో వేర్వేరుగా నిర్వహించనున్న బీఏసీ సమావేశాల్లో ఎన్నిరోజుల పాటు సభలను నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read: US Tariffs : ట్రంప్‌నకు బిగ్ షాకిచ్చిన అమెరికా కోర్టు.. టారిఫ్‌ల మోతపై ఆగ్రహం.. హద్దులు మీరారంటూ..
అసెంబ్లీ ఉభయ సభల సమావేశాలు సజావుగా జరిగేందుకు అధికారులు, పోలీసు సిబ్బంది పూర్తిస్థాయిలో సహకారం అందించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశించారు. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల నిర్వహణ, వసతులు, ఏర్పాట్లు, భద్రత తదితర అంశాలపై శుక్రవారం శాసనసభ ఆవరణలో ఉన్నతాధికారులతో వారు సమావేశం నిర్వహించారు. ఆయా శాఖలకు సంబంధించిన చర్చలు జరిగే సమయంలో సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులు, సభ్యులకు తగిన సమాచారం అందజేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆదేశించారు.
పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ, బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, యూరియా కొరత, వరద నష్టం, ప్రభుత్వ పరంగా పునరావాసం, సహాయక చర్యలు, గురుకుల విద్యా సంస్థల్లో సమస్యలు వంటి అంశాలను ఎజెండాలో చేర్చాలని అధికార, విపక్షాలు పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి.
అసెంబ్లీ సమావేశాల్లో పీసీ ఘోష్ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. దీంతో కాళేశ్వరం కమిషన్‌పై వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. మేడిగడ్డ కుంగుబాటుకు మాజీ సీఎం కేసీఆర్ కారణమని ప్రభుత్వం అంటుంది.
పీసీ ఘోష్ కమిషన్ పై చర్చ, సిట్ ఏర్పాటు పేరిట ఇరకాటంలోకి నెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలను అసెంబ్లీ వేదికగానే తిప్పికొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తుకోసం పట్టుబట్టాలని బీజేపీ శాసనసభా పక్షం నిర్ణయించింది. ఆ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సన్నద్ధమవుతోంది. మరోవైపు.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై సభలో చర్చించే అవకాశం ఉంది.