ట్రంప్ టారిఫ్ లు చెల్లవ్.. అమెరికా అధ్యక్షుడికి షాకిచ్చిన లోకల్ కోర్టు.. హద్దులు దాటారంటూ హాట్ కామెంట్స్
టారిఫ్‌ల (US Tariffs) విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చట్ట విరుద్ధమని

US Tariffs
US Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని పలు దేశాల ఉత్పత్తులపై పెద్దమొత్తంలో టారిఫ్‌లు (US Tariffs) విధించిన విషయం తెలిసిందే. ఇందులో భారతదేశం కూడా ఉంది. రష్యా నుంచి భారీగా చమురును కొనుగోలు చేస్తూ.. యుక్రెయిన్‌పై యుద్ధానికి భారత దేశం కారణం అవుతుందంటూ అర్ధంపర్ధంలేని వాదనలతో భారత ఉత్పత్తులపై ట్రంప్ భారీగా టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. తాజాగా.. టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Also Read: Daruma Doll: జపాన్‌లో ప్రధాని మోదీకి బహుమతిగా దరుమా డాల్.. అసలేంటీ బొమ్మ? ప్రత్యేకతలు ఏంటి?
డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు చాలా వరకు చట్ట విరుద్ధమని అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ట్రంప్ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్‌లను విధించినట్లు పేర్కొంది. భారీగా విధించిన సుంకాలు పలు దేశాలను ప్రభావితం చేశాయని కోర్టు పేర్కొంది. అయితే, ప్రస్తుతం ఆయా దేశాలపై విధించిన టారిఫ్ లను అక్టోబర్ నెల మధ్య నాటికి కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతిచ్చారు. మరోవైపు ఈ నిర్ణయాన్ని యూఎస్ సుప్రీంకోర్టులో సవాలు చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు నిర్ణయంపై ట్రంప్ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు.
కోర్టు తీర్పుపై మండిపడ్డ ట్రంప్ ..
ట్రంప్ విధించిన సుంకాలు చాలా వరకు చట్ట విరుద్ధమని అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్టు చేశారు. అన్ని దేశాలపై విధించిన సుంకాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాలను తొలగించాలని పక్షపాత అప్పీళ్ల కోర్టు తీర్పు చెప్పింది. ఈ ప్రక్రియలో చివరికి అమెరికా విజయం సాధిస్తుందని ట్రంప్ అన్నారు. అమెరికా మరింత బలపడాలని మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ, కోర్టు తాజా నిర్ణయం దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తుందని ట్రంప్ చెప్పారు. యూఎస్ సుప్రీంకోర్టు సహాయంతో టారిఫ్ లను మన దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించి అమెరికాను బలమైన, ధనిక, శక్తివంతంగా మారుస్తానని ట్రంప్ పేర్కొన్నారు.

US Tariffs
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత భారత దేశం నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 26శాతం టారిఫ్ విధించాడు. కొద్దిరోజులకు రష్యా నుంచి భారతదేశం చమురును తక్కువకు కొనుగోలుచేస్తూ లబ్ధి పొందుతోందని, అదే సమయంలో యుక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాను ప్రోత్సహిస్తుందని ఆరోపిస్తూ టారిఫ్‌లను 50శాతానికి పెంచారు. ఈనెల 27వ తేదీ నుంచి పెంచిన టారిఫ్ లు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.