Daruma Doll: జపాన్‌లో ప్రధాని మోదీకి బహుమతిగా దరుమా డాల్.. అసలేంటీ బొమ్మ? ప్రత్యేకతలు ఏంటి?
ప్రధానమంత్రి మోదీకి దరుమ బొమ్మను బహుమతిగా ఇవ్వడం అంటే లోతైన అర్థాన్ని కలిగి ఉంది. ఇది కేవలం స్నేహపూర్వక సంజ్ఞ మాత్రమే కాదు. (Daruma Doll)

ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల టూర్ కోసం ఆయన జపాన్ వెళ్లారు. అక్కడ ఇండో జపాన్ వార్షిక సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇండియా మీద అమెరికా టారిఫ్ ల నేపథ్యంలో ప్రధాని మోదీ జపాన్ టూర్ ఆసక్తిగా మారింది. అదే టైమ్ లో జపాన్ లో ప్రధాని మోదీ మేకిన్ ఇండియా నినాదాన్నిచ్చారు. ఓ వైపు అమెరికా.. ఇండియాలో ఉత్పత్తి చేస్తే టారిఫ్ లు విధిస్తామంటూ ఆపిల్ లాంటి కంపెనీలను హెచ్చరిస్తోంది. అదే టైమ్ లో అమెరికా కాకుండా ఇతర దేశాలు భారత్ లో ఉత్పత్తి చేసేలా మోదీ ప్రయత్నాలు ప్రారంభించారు.
ప్రధాని మోదీ జపాన్ టూర్ లో ఓ చిత్రమైన బహుమతిని అందుకున్నారు. అదేంటో కాదు. దరుమా బొమ్మ. గుండ్రంగా, పెద్ద పెద్ద కళ్లతో ఉండే ఈ బొమ్మ జపాన్ లో అదృష్ట సూచికగా పిలుస్తారు. ఈ దరుమా బొమ్మను షోరింజన్ దరుమా జీ ఆలయ ప్రధాన పూజారి.. ప్రధాని మోదీకి అందజేశారు.
ఏంటి ఈ దరుమా బొమ్మ?
ప్రముఖ జపనీస్ బౌద్ధ గురువు బోధిధర్మ తర్వాత ఆయన గుర్తుగా ఈ బొమ్మను తీసుకొచ్చారు. ఇది ఎర్రగా, గుండ్రంగా ఉంటుంది. పెద్ద కళ్లు, కనుబొమలు, బొర్రమీసాలు ఉంటాయి. బోధి ధర్మ తొమ్మిదేళ్ల పాటు కనీసం కన్ను ఆర్పకుండా, కదలకుండా మెడిటేషన్ చేశారని చెబుతారు. అందుకే బొమ్మను పరిశీలిస్తే కళ్లు తెరిచే ఉంటాయి. ఓ వ్యక్తి క్రమశిక్షణ, కమిట్ మెంట్ కు సింబాలిక్ గా ఉంటుందీ దరుమా బొమ్మ. అలాగే, ఈ బొమ్మకి కాళ్లు, చేతులు ఉండవు.
సరదాగా ఇచ్చేవి కావు..
దరుమా బొమ్మలను అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు జపనీయులు. అలా అని ఎవరికి పడితే వారికి ఇవ్వరు. దానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఎవరైతే దీన్ని అందుకుంటారో వారు ఓ కోరిక కోరుకుని, ఓ గోల్ సెట్ చేసుకుని ఆ బొమ్మకి ఉన్న కళ్లలో ఒక కన్నుకి బ్లాక్ ఇంకు పూస్తారు.
ప్రధాని మోదీకి ఇవ్వడం వెనుక..
జపనీయులు ఇంత గొప్పగా భావించే దరుమా బొమ్మను ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వడం వెనుక కూడా ఓ అర్థం ఉంది. ఏదో ఇండియా – జపాన్ ఫ్రెండ్ షిప్ కాబట్టి ఇచ్చింది కాదు. ఇండియా గొప్పగా ఎదగాలని, విజయం సాధించాలని, ఎదురుదెబ్బలను తట్టుకుని నిలబడాలని, వ్యక్తిగతంగానూ – దేశానికి సంబంధించి పురోభివృద్ధి సాధించాలని కోరుకుంటూ ఇచ్చినదిగా భావించాలి.
ఇండియాలో జపాన్ పెట్టుబడులు డబుల్?
మరోవైపు ఇండియాలో జపాన్ పెట్టుబడులు రెండింతలు అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇరుదేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు సంబంధించి అగ్రిమెంట్లు చేసుకునే అవకాశం ఉంది.