Bhatti Vikramarka : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ నేతలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో యూరియా కొరతను నిరసిస్తూ గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీగా వచ్చారు. అసెంబ్లీ ఆవరణలో ప్లకార్డులు పట్టుకొని తమ నిరసన తెలిపారు. అయితే, బీఆర్ఎస్ నేతల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఫైర్ అయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు నిజాలు వెల్లడించేందుకు అసెంబ్లీలో తమకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) ఇచ్చే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసన సభ స్పీకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కేసీఆర్ కృషిని, కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు అవకాశం కల్పించాలని స్పీకర్‌ను కోరినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. అయితే, అసెంబ్లీ సమావేశాల్లోనూ పీపీటీ అంశంపై ఇరుపార్టీల సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యులు హరీశ్ రావు మాట్లాడుతూ.. అసెంబ్లీలో పీపీటీ ఇస్తామని చెప్తుంటే.. కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని ఆరోపించారు. పీపీటీకి అవకాశం ఇవ్వడం లేదంటే వాస్తవాలను వినడానికి సిద్ధంగా లేరని అర్ధం అవుతుందని, అన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారంటూ హరీశ్ రావు అన్నారు. హరీశ్ రావు వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాకు ఇచ్చారా? అసెంబ్లీలో ప్రతిపక్షాలకు పీపీటీ ఇచ్చే సాంప్రదాయం లేదు. గత సాంప్రదాయాన్నే మేము కొనసాగిస్తామని భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమకు పీపీటీ అవకాశం ఇవ్వాలని లేఖ కూడా రాసినట్లు భట్టి గుర్తు చేశారు. అయినా తమకు అవకాశం ఇవ్వలేదని, అప్పుడు లేనిది ఇప్పుడెలా ఉంటుందంటూ భట్టి ప్రశ్నించారు. అప్పులపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని భట్టి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6500 కోట్లు వడ్డీ కట్టడం లేదని బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని.. అప్పులపై వడ్డీలు బీఆర్ఎస్ నాయకులు కడుతున్నారా..? అంటూ భట్టి విక్రమార్క నిలదీశారు.