Eatala Rajender : టార్గెట్ ఈటల.. అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్..? మర మనిషి వ్యాఖ్యల ఎఫెక్ట్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలవక ముందే రాజకీయ రచ్చ మొదలైంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. అసెంబ్లీ స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలతో మంట రాజుకుంది. స్పీకర్ మర మనిషిలా వ్యవహరిస్తున్నారు అంటూ ఆయన చేసిన కామెంట్స్ అగ్గి రాజేశాయి.

Eatala Rajender : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలవక ముందే రాజకీయ రచ్చ మొదలైంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. అసెంబ్లీ స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలతో మంట రాజుకుంది. స్పీకర్ మర మనిషిలా వ్యవహరిస్తున్నారు అంటూ ఆయన చేసిన కామెంట్స్ అగ్గి రాజేశాయి. దీనిపై వివరణ ఇవ్వాలని ఈటలకు అసెంబ్లీ కార్యాలయం నోటీసులు కూడా పంపింది. ఈటల బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్, ఈటల మాటల్లో తప్పేమీ లేదని బీజేపీ వాదించుకుంటున్నాయి. మరోవైపు వర్షాకాల సమావేశాల నుంచి ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేసే అవకాశం ఉందనే ప్రచారమూ జరుగుతోంది.

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇలాంటి సమయంలో అసెంబ్లీ స్పీకర్ ని మరమనిషి అంటూ బీజేఎల్పీ నేత ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సీఎం చెప్పింది చేయడం తప్ప, స్పీకర్ సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదంటూ ఈటల ఘాటుగానే విమర్శలు చేశారు.

ఉమ్మడి ఏపీలో 80, 90 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగేవన్న ఈటల.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ ను మరమనిషి అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

ఈటల రాజేందర్ వ్యాఖ్యలను స్పీకర్ కార్యాలయం సీరియస్ గా తీసుకుంది. మరమనిషి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈటలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. నోటీసులకు వివరణ ఇచ్చిన తర్వాత స్పీకర్ తగిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అవసరమైతే వర్షాకాల సమావేశాల నుంచి ఈటలను సస్పెండ్ చేసే అవకాశమూ కనిపిస్తోంది. అయితే ఈ నెల 12, 13తేదీల్లో జరిగే వర్షాకాల సమావేశాల్లో ఈటల రాజేందర్ పాల్గొనకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సస్పెండ్ చేయడం కోసమే నోటీసులు జారీ చేశారని మండిపడుతున్నారు.

అటు ఈటల వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈటల అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభాపతి స్థానాన్ని అగౌరవపరుస్తూ మాట్లాడటం విచారకరమన్నారు.

మర మనిషి వ్యాఖ్యల రచ్చ జరుగుతున్న క్రమంలో మరోసారి తన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు ఈటల రాజేందర్. స్పీకర్ పోచారం స్థాయిని తగ్గించింది తాను కాదని, టీఆర్ఎస్ ప్రభుత్వమే ఆ పని చేస్తోందని అన్నారు. తానేమీ అన్ పార్లమెంటరీ పదజాలం వాడలేదని, స్పీకర్ తనకు తండ్రి సమానులు అని తెలిపారు. స్పీకర్ మీద, శాసనసభ మీద తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు. రాష్ట్రంలో మంత్రులు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదన్నారు ఈటల. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అనుమతి లేకుండా సీఎం కేసీఆర్ ను కలవలేరని అన్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని ఈటల చెప్పారు.

మొత్తంగా ఈటల వ్యాఖ్యలపై మొదలైన రగడ, ఇప్పట్లో చల్లబడేలా కనిపించడం లేదు. ఈ సమావేశాలకు హాజరుకాకుండా ఈటలపై సస్పెన్షన్ వేటు వేస్తే ఇక పొలిటికల్ రచ్చ వేరే లెవల్ కి చేరుకోనుంది.