TG BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు?

తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరనే అంశంపై ఉత్కంఠ వీడింది. బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం.

Ramachander rao

TG BJP: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరనే అంశంపై ఉత్కంఠ వీడినట్లు తెలుస్తోంది. బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. ఆరెస్సెస్ తో పాటు కొందరు సీనియర్ నేతలు రామచందర్ రావు పేరును బలంగా ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇప్పటికే రామచందర్ కు హైకమాండ్ సమాచారం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన ఇవాళ మధ్యాహ్నం 2గంటల సమయంలో నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.

Also Read: AP BJP: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్..?

తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్ష ఎంపికకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి తుది రేసులో మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావుతోపాటు ఎంపీ ఈటల రాజేందర్ పేరుకూడా ప్రముఖంగా వినిపించింది. అయితే, అధిష్టానం మాత్రం అధ్యక్ష పదవికి రామచంద్రరావు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే, రామచంద్రరావుతోపాటు ఓ ఎంపీగా కూడా అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే ఎన్నిక అనివార్యం కానుంది.

రామచందర్ రావు బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. అనేక పదవుల్లో ఆయన పార్టీకి సేవలందించారు. 1980-82 మధ్య భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారు. 1999 నుంచి 2003 వరకు బీజేపీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా, 2003 నుంచి 2006 వరకు బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ గా పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు బీజేపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడిగానూ అతను పనిచేశారు. 2015లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.