AP BJP: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్.. ఖరారు చేసిన పార్టీ అధిష్టానం

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరును కేంద్ర పార్టీ అధిష్టానం దాదాపు ఫైనల్ చేసినట్లు సమాచారం.

AP BJP: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్.. ఖరారు చేసిన పార్టీ అధిష్టానం

PVN Madhav

Updated On : June 30, 2025 / 12:22 PM IST

AP BJP: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పి.వి. సత్యనారాయణ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఆదివారం విడుదల చేశారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఓటింగ్ అర్హత కలిగినవారు 119 మంది ఉన్నారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ వ్యవహరించనున్నారు. నామినేషన్ పత్రాల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ మొత్తం ఇవాళే జరగనుంది.

Also Read: TG BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు?

అధిష్టానం నిర్ణయం మేరకు ఒకరే నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే మాత్రం జులై 1వ తేదీన పోలింగ్ నిర్వహించి బీజేపీ ఏపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యవరిస్తున్న విషయం తెలిసిందే. ఆమె అధ్యక్ష పదవీకాలం పూర్తయింది. అయితే, ఆమెనే మరోసారి అధ్యక్ష స్థానంలో కొనసాగిస్తారని ప్రచారం జరిగింది. కానీ, బీజేపీ అధిష్టానం కొత్త వారికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైంది.

పీవీఎన్ మాధవ్ పేరు ఖరారు..
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికోసం పలువురు నేతలు పోటీపడుతున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్దన్ రెడ్డి, ఎంపీ సీఎం రమేశ్ పేర్లు అధ్యక్ష పదవి రేసులో ప్రముఖంగా వినిపించాయి. అయితే, అధిష్టానం పీవీఎన్ మాధవ్ వైపు మొగ్గు చూపింది. ఆయన పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాధవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం పీవీఎన్ మాధవ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన బీజేపీ సీనియర్ నేత, దివంగత పీవీ చలపతిరావు కుమారుడు. గతంలో ఆయన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. ఆర్ఎస్ఎస్, బీజేవైఎం, ఏబీవీపీలో వివిధ పదవులు నిర్వహించారు.