kishan Reddy
Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో మార్పు రాదు. కేవలం బీజేపీతోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం మీట్ ది ప్రెస్ లో కిషన్ రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి మాట్లాడుతున్నాడు.. కేంద్రం నిధులు ఇవ్వకుంటే తెలంగాణలో రోడ్డు ఎక్కడవి అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. జాతీయ రహదారులు, రైల్వేల అభివృద్ధికి తెలంగాణకు కేంద్రం భారీగా నిధులిచ్చిందని, తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర కీలకం అని కిషన్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పూర్తి అవగాహనతో ముందుకెళ్తున్నాయి. కేసీఆర్ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ తోనే ప్రారంభించాడు. ఆ రెండు పార్టీలకు పూర్తి అవగాహన ఉంది. 2024లో కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ తో ఎలాంటి సంబంధాలు లేవని, కాంగ్రెస్ అమ్ముకునే పార్టీ అయితే.. బీఆర్ఎస్ కొనుక్కొనే పార్టీ అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో పరిపాలన గాడితప్పింది. ఒక కుటుంబం చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయింది. రాష్ట్రంలో సీఎం, మంత్రులను కలిసే పరిస్థితి లేదని కిషన్ రెడ్డి అన్నారు. వాస్తు బాగాలేదని పాతసెక్రటేరియట్ ను కూలగొట్టారు. కొత్త సెక్రటేరియట్ కు కూడా సీఎం రావడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రగతిభవన్ ను ప్రజా భవన్ గా మారుస్తామని అన్నారు. పార్టీ ఆదేశాల మేరకే నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కిషన్ రెడ్డి చెప్పారు.
బీసీ ముఖ్యమంత్రి అజెండాతో ఎన్నికలకు వెళ్తున్నాం. తెలంగాణకు బీసీ నేతను ముఖ్యమంత్రిని చేయటమే బీజేపీ లక్ష్యం అని కిషన్ రెడ్డి అన్నారు. బీసీలు తలచుకుంటే అన్ని పార్టీలు కొట్టుకుపోతాయి. బీసీ తలుచుకుంటే తెలంగాణలో ఏదైనా సాధ్యమవుతుందని అన్నారు. 50శాతం మంది తెలంగాణలో బీసీలు ఉన్నారు. బీజేపీ అధిష్టానం ఇప్పటికే బీసీనే మా ముఖ్యమంత్రి అభ్యర్ధి అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో బీసీలంతా బీజేపీకి మద్దతు పలకాలని కిషన్ రెడ్డి కోరారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా రాహుల్ గాంధీ, కేటీఆర్ లు మాట్లాడారంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు.