Telangana Budget 2025-26: తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టగా.. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు. అయితే, బడ్జెట్ లో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Also Read: Telangana Budget: తెలంగాణ బడ్జెట్.. రైతులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్
బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. త్వరలో 14,236 అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,236 ఖాళీ పోస్టులను భర్తీ చేయడం ద్వారా అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదిలాఉంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని, దీంతో తెలంగాణలో నిరుద్యోగ రేటు 22.9శాతం నుంచి 18.1 శాతానికి తగ్గించిందని భట్టి విక్రమార్క అన్నారు.
రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6వేల కోట్లను బడ్జెట్ లో కేటాయించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిందే రాజీవ్ యువ వికాస పథకం. ఈ పథకం ద్వారా ఐదు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు బడ్జెట్ లో ఆరువేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇదిలాఉంటే సిటీ శివారు ప్రాంతమైన ముచ్చర్లలో యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్శిటీ ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా ఏఐ సిటీగా 200 ఎకరాల్లో ప్రత్యేక టెక్ హబ్ ఏర్పాటు కూడా శ్రీకారం చుట్టబోతోంది. త్వరలోనే వివిధ నోటిఫికేషన్ల ద్వారా 57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనుంది.