Telangana : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..ప్రభుత్వం, విపక్షాలు సిద్ధం

Budjet
Telangana budget : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగనున్నాయి. అసెంబ్లీ వేదికగా సర్కార్‌ను ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తుంటే.. అసలు విపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అటాకింగ్ మోడ్‌తో దూకుడు కనబరచాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దీని కోసం ఇప్పటికే పక్కా స్కెచ్‌ను రెడీ చేసింది సర్కార్. 2021- 2022 సంవత్సరానికి గాను బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.. దీని కోసం సోమవారం నుంచి సమావేశాలను నిర్వహించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది.. దీంతో బడ్జెట్ సమావేశాలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని అధికార, ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
ఈ సమావేశాలలో వచ్చే ఏడాదికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. బడ్జెట్ పద్దులపై చర్చ వాడివేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.. వివిధ సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయనున్నాయి ప్రతిపక్షాలు. అయితే ఈ బడ్జెట్ పద్దులపై జరిగే చర్చలో విపక్షాల విమర్శలను సమర్దవంతంగా తిప్పికొట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే శాఖల వారిగా గత కేటాయింపులు, ఖర్చు.. ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ఇలా అన్ని అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు సమగ్ర సమాచారంతో సభకు రావాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. అంతేకాదు.. ఈ బడ్జెట్ లో సబ్జెక్టులవారిగా ఎవరెవరు మాట్లాడాలన్న దానిపై కూడా ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది సర్కార్. ఈ సమావేశాలలో బడ్జెట్ పద్దులుపైనే కాకుండా.. ఐటీఐఆర్, డబుల్ బెడ్ రూమ్స్, నిరుద్యోగ భృతి, రైతు చట్టాలు, రైతు రుణమాఫి, ధరణిలో నెలకొన్న సమస్యలు ఇలా చాలా అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్దంగా ఉన్నాయి.
ఈ అంశాలను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే.. ఐటీఐఆర్‌తోపాటు.. బయ్యారం ఉక్కు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా పట్ల తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షను సభా వేదికగా ప్రజలకు అర్థం అయ్యేలా వివరించాలని డిసైడ్ అయ్యింది ప్రభుత్వం. అసెంబ్లీలో ప్రభుత్వ తీరును నిలదీస్తామంటున్నారు బీజేపీ నేతలు.. అసెంబ్లీలో తమకు సమయం ఇవ్వకపోతే స్పీకర్‌ను కూడా నిలదీస్తామంటున్నారు బీజేపీ నేతలు.. భైంసా అల్లర్లు, చిన్న పాపపై జరిగిన రేప్, కార్యకర్తలపై అక్రమ కేసులు ప్రస్తవిస్తామంటున్నారు. ఏదేమైనా ఈసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.. మరి ప్రభుత్వం అవలంబించే వ్యూహాలు ఏ మాత్రం వర్కటవుతుందో చూడాలి.