తెలంగాణ క్యాబినెట్ ఎక్స్‌ప్యాన్షన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉంటే..ఎన్నోవాయిదాలు..మరెన్నో అడ్డంకులు..చాలా ఈక్వేషన్స్ తర్వాత మూడింటిని భర్తీ చేశారు. మిగిలిన మూడు పదవులను కూడా రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలోపే భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తోందట.
పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా క్యాబినెట్ విస్తరణపై డిస్కషన్ చేశారు. అయితే మంత్రివర్గంలో మిగిలిన ఆ మూడు పదవుల కోసం దాదాపు పది మందికిపైగా నేతలు పోటీ పడుతున్నారు. అమాత్య యోగంపై ఆశలు పెట్టుకున్న వారందరికీ పదవి ఇవ్వలేరు కనుక..కొంత మంది నేతలను పిలిచి స్వయంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడారు.
హైదరాబాద్ వస్తూ వస్తూనే మొదట ఆరుగురు ఎమ్మెల్యేలను హోటల్‌కు పిలిపించుకొని మాట్లాడారు ఖర్గే. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలతో వన్ టు వన్ డిస్కస్ చేశారు. ఈ ఆరుగురికి క్యాబినెట్‌లో చోటు కల్పించలేమని చెప్పేశారట. ఆశావహుల ముందు పలు పోస్టులను ప్రస్తావించారట.
నేతల అసంతృప్తి
ప్రభుత్వ చీఫ్ విప్, క్యాబినెట్ ర్యాంక్ ఉన్న కార్పొరేషన్ పదవులైన..ఆర్టీసీ ఛైర్మన్, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్, హుడా, ఫ్యూచర్ సిటీ కార్పొరేషన్ వంటి పోస్టులు ఇస్తామంటూ ఆశచూపారట. దీంతో కొంత మంది నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రేమ్‌సాగర్ వంటి నేతలు అయితే అసంతృప్తితో రగిలిపోతుంటే..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుజ్జగించారు. ఇక మల్ రెడ్డి రంగారెడ్డి, బాలునాయక్, సుదర్శన్ రెడ్డి కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి పదవి రాని వ్యక్తులు ఎవరినేది తేలిపోయింది. ఇక ఖాళీగా ఉన్న మూడు క్యాబినెట్ బెర్తులు ఎవరికి దక్కుతాయనేది ప్రస్తుతం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఖర్గేతో మీటింగ్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పిలవకపోవడంతో..ఆయనకు క్యాబినెట్ ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుంది. పార్టీ అధిష్టానం కూడా గతంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి బెర్త్ ఖాయమంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇక మిగతా రెండు మంత్రి పదవుల్లో గ్రేటర్ కోటాలో ఒకటి ముస్లింలకు ఇవ్వనున్నట్లు గాంధీభవన్ వర్గాల టాక్.
ఇక మరో బెర్త్ ఎవరికి దక్కుతుందనేది సస్పెన్స్‌గా మారింది. ఇద్దరు మాల, ఇద్దరు మాదిగలకు ఆల్రెడీ క్యాబినెట్‌లో అవకాశం దక్కడంతో ఎస్సీలకు అవకాశం లేదంటున్నారు. ఇక మిగిలిన ఒకటి బీసీకా, ఓసీకా అనేది క్లారిటీ లేదు. అయితే నిజామాబాద్ జిల్లా నుంచి రేసులో ఉన్న సుదర్శన్‌రెడ్డికి చోటు కల్పించలేమని చెప్పారు కాబట్టి..ఎమ్మెల్యే మదన్ మోహన్‌ను క్యాబినెట్‌లోకి తీసుకుంటారన్న టాక్ వినిపిస్తోంది. ఈ సారి క్యాబినెట్ ఎక్స్‌ప్యాన్షన్‌లో ఏ ఈక్వేషన్స్ పనిచేస్తాయో.? లాస్ట్ మూమెంట్‌లో క్యాబినెట్‌లో చోటు సంపాదించుకునేదెవరో? చూడాలి మరి.