తెలంగాణ కేబినెట్ భేటీ, ఎన్నికల వేళ వరాల జల్లు!

  • Publish Date - November 13, 2020 / 07:03 AM IST

Telangana cabinet meeting On Friday : తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి తరువాత జరగనున్న ఈ కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటుందన్న అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రధానంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, రైతు సమస్యలపైనే చర్చించనున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. వీలైనంత తొందరగా ఎన్నికలు పూర్తి చేయాలన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.



గురువారం మధ్యాహ్నం మంత్రులు, పార్టీ నేతలతో చర్చించిన సీఎం కేసీఆర్.. గ్రేటర్ ఎన్నికల వ్యూహంపై చర్చించారు. దీంతో 2020, నవంబర్ 13వ తేదీ శుక్రవారం సాయంత్రం భేటీ కానున్న మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికాలు అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే గ్రేటర్ ప్రజలకు పలు వరాలు కురిపించిన సర్కారు.. మరిన్ని వరాలు కురిపించేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చ జరుగుతోంది. గ్రేటర్ వాసులకు ఉచితంగా నీటిని అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.



డిసెంబర్‌ మొదటి వారంలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని రాజకీయ పార్టీలతో గురువారం సమావేశమైన ఎన్నికల కమిషన్.. ఆయా పార్టీల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దీపావళి పండుగ అనంతరం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశముందని రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. అలాగే సన్నరకం ధాన్యానికి మద్దతు ధరపై కూడా మంత్రి వర్గం చర్చించనుంది. వర్షాల వల్ల పంటనష్టం, హైదరాబాద్ వరదల నష్టంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.