Chicken Shops : చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1నుంచి చికెన్ షాపులు బంద్.. కారణాలు ఇవే..
Chicken Shops : తెలంగాణలో చికెన్ ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ చేయాలని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.
- Harishth Thanniru
- Published On : March 26, 2026 / 10:57 AM IST
Chicken Shops
- తెలంగాణలో చికెన్ ప్రియులకు బిగ్ షాక్
- ఏప్రిల్ 1నుంచి చికెన్ షాపులు బంద్
- చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటన
Chicken Shops : తెలంగాణలో చికెన్ ప్రియుల సంఖ్య ఎక్కువే. కొందరు వారంలో రెండుమూడు రోజులు చికెన్ లేనిదే ముద్ద ముట్టరు. అధికశాతం మందికి ఆదివారం చికెన్ ఉండాల్సిందే. అయితే, అలాంటి వారికి ఇప్పుడు బిగ్ షాకింగ్ న్యూస్. ఎందుకంటే తెలంగాణ చికెన్ షాప్స్ ఓనర్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చింది.
తెలంగాణలో చికెన్ ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ చేయాలని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో షాపుల ముందు పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ద్వారా తమ నిరసనను వ్యాపారులు బహిరంగంగా ప్రకటించారు.
పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే కమీషన్, మార్జిన్ గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయిందని చికెన్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. కిలోకు సుమారు రూ.20 వరకు తగ్గించడంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఒకవైపు మార్కెట్లో చికెన్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండగా, మరోవైపు తమకు లభించే లాభం తగ్గిపోవడం వల్ల వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. విద్యుత్, రవాణా, కార్మిక ఖర్చులు పెరిగాయని, వేసవికాలంలో నిల్వ ఖర్చులు కూడా అధికమవుతున్న ఈ పరిస్థితుల్లో మార్జిన్ తగ్గించడం తమకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని చికెన్ షాపుల వ్యాపారులు పేర్కొంటున్నారు.
వారంరోజుల క్రితం వరకు కిలో చికెన్ రూ.320గా ఉంది. అయితే, ఒక్కసారిగా ధరలు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో చికెన్ ధరలు కిలోకు రూ.360 నుంచి రూ.400 వరకు ఉంది. లైవ్ కోడి ధర కిలోకు రూ.220 ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ రూ.360 నుంచి రూ.400 వరకు అమ్ముతున్నారు. ఇక నాటు కోడి ధర కిలోకు రూ.700 నుంచి రూ.800 వరకు ఉండటం గమనార్హం. ధరలు పెరిగినా లాభం మాత్రం రావడం లేదని చికెన్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పౌల్ట్రీ కంపెనీలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల తమలాంటి చిన్న వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోతున్నారని చికెన్ వ్యాపారులు పేర్కొంటున్నారు. అయితే, మార్కెట్లో డిమాండ్, సప్లయ్ అసమతుల్యత, ఫీడ్ ధరల పెరుగుదల, ఉత్పత్తి వ్యయాలు అధికమవడం వంటి కారణాలతో మార్జిన్ తగ్గించాల్సి వచ్చిందని ఫౌల్ట్రీ కంపెనీలు పేర్కొంటున్నాయి.
ఈ సమస్యపై చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తో చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలో పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నా యని వెల్లడించాయి. మరోవైపు.. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని ఆపేది లేదని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు త్వరగా జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని వ్యాపారులు కోరుతున్నారు. లేదంటే ఈ బంద్ దీర్ఘకాలం కొనసాగి మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
