BRS Expansion: స‌ర్వే సంస్థల నివేదిక‌ల ఆధారంగా.. జాతీయస్థాయిలో కేసీఆర్ పకడ్బందీ స్కెచ్‌!

ఒక్కో రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెడుతున్న కేసీఆర్.. పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా ఉండి.. బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలను ఎంచుకుంటున్నట్లు చెబుతున్నారు.

kcr plans to expand brs in national level

BRS Party Expansion: గులాబీ పార్టీని జాతీయస్థాయిలో విస్తరించే ప్లాన్‌లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) పకడ్బందీ స్కెచ్‌లు వేస్తున్నారు. ఏయే రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ ఎదిగేందుకు అవకాశం ఉందో తెలుసుకుని.. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ప్రత్యేకంగా సర్వేలు చేయిస్తూ.. అందుకు అణుగుణంగా నడుచుకుంటున్నారు. ముఖ్యంగా పక్కనే ఉన్న మహారాష్ట్ర (Maharashtra)లో బీఆర్‌ఎస్‌ పార్టీకి మంచి స్పందన కనిపిస్తుండటంతో ప్రత్యేక ఫోకస్ (Special Focus) పెట్టారు సీఎం కేసీఆర్.

గులాబీ పార్టీని జాతీయ పార్టీగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేలా అడుగులు వేస్తున్నారు. తెలంగాణకు పక్కనే ఉన్న మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ విస్తరణకు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అవసరమైన చోట స్థానిక పార్టీలతో అవగాహన కుదుర్చుకోవడంతోపాటు.. సొంతంగా ఎదిగేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించేలా అడుగులు వేస్తున్నారు. ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లేలా.. ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటే పార్టీ విస్తరణకు అడుగులు పడతాయనే విషయమై ప్రత్యేకంగా సర్వేలు చేయిస్తున్నారు సీఎం కేసీఆర్.

బీఆర్‌ఎస్ పార్టీకి పక్క రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మ‌ద్దతు లభిస్తోంది. ఒడిశా నుంచి మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బీఆర్‌ఎస్‌లో చేరగా, మ‌హారాష్ట్రలో కీలక నేతలు కారు పార్టీ ఎక్కేందుకు ఆసక్తి చూపుతున్నారు. మ‌ధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ వంటి రాష్ట్రాల నుంచి చాలా మంది నేత‌లు గులాబీ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.

స‌ర్వే సంస్థల నివేదిక‌ల ఆధారంగానే పక్క రాష్ట్రాల్లో పార్టీ విస్తర‌ణ కోసం సీఎం కేసీఆర్ చ‌ర్చలు జ‌రుపుతున్నారు. గత మూడు నెల‌లుగా మ‌హారాష్ట్ర నుంచి నేత‌లు అధిక సంఖ్యలో కారుపార్టీలో చేరారు. మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో వ‌రుస‌గా చేరుతున్నారు. ఆ రాష్ట్రం నుంచి వ‌స్తున్న స్పంద‌న‌తో అక్కడ బిఆర్ఎస్ స‌భ్యత్వ న‌మోదును మొద‌లు పెట్టారు. నెల రోజుల క్రితం స్వయంగా సీఎం కేసిఆర్ మ‌హారాష్ట్రలో డిజిట‌ల్ స‌భ్యత్వాన్ని ప్రారంభించారు.

Also Read: ఢిల్లీకి క్యూ కట్టిన తెలంగాణ నేతలు.. హస్తిన పరిణామాలపై తెలంగాణ పాలిటిక్స్ లో ఉత్కంఠ

ఇదే మాదిరిగా మిగిలిన రాష్ట్రాల్లో కూడా పార్టీ విస్తర‌ణ‌పై కేసిఆర్ దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ఒకే సారి బ‌ల‌ప‌డ‌డం అసాధ్యమ‌న్న అభిప్రాయంతో రాజ‌కీయంగా అవ‌కాశం ఉన్న రాష్ట్రాల‌కు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సిఎం భావిస్తున్నారు. మ‌హారాష్ట్రతో పాటు ఒడిశాలో పార్టీ కార్యక్రమాల‌ను ముమ్మరం చేయాల‌న్న యోచ‌న‌లో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన కీల‌క నేత‌లు కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్న సంకేతాలు ఇవ్వడంతో ఆ రాష్ట్ర నేత‌ల‌తో వ‌రుస‌గా చ‌ర్చలు జ‌రుపుతున్నారు. జాతీయ స్థాయిలో కీల‌క పాత్ర పోషించిన ప‌లువురు నేత‌ల‌తో పాటు రాష్ట్రంలో ప‌ట్టున్న నేత‌లు ఛత్తీస్‌ఘడ్ నుంచి బిఆర్ఎస్ లో చేరే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: ఉప్పల్ స్కై వాక్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. ప్రత్యేకతలు

ఇటీవ‌ల కొద్ది రోజులుగా మ‌ధ్యప్రదేశ్ నుంచి కూడా గులాబీ పార్టీకి వ‌ల‌స‌లు మొద‌ల‌య్యాయి. ఆ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున నేత‌ల‌ను కారెక్కించుకునేందుకు గులాబీ బాస్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పంజాబ్, హ‌ర్యానా వంటి రాష్ట్రాల్లో రైతు సంఘాల ప్రభావం ఎక్కువ‌గా ఉండ‌టంతో రైతు నేత‌ల‌కే పార్టీలో కీల‌క బాధ్యత‌లు క‌ట్టబెట్టి ఆ రాష్ట్రాల్లో ప‌ట్టు పెంచుకునే విధంగా కేసీఆర్ పావులు క‌దుపుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: అమిత్ షాతో మంత్రి కేటీఆర్ భేటీ రద్దు.. కారణమేమంటే?

ఇలా ఒక్కో రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెడుతున్న కేసీఆర్.. పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా ఉండి.. బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలను ఎంచుకుంటున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంతోపాటు మిగిలిన చోట్ల ఎంపీ స్థానాల్లో గెలిచి వచ్చే ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు.. ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎలా ముందుకు వెళ్లాలనే విషయాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేయిస్తున్నారు. సర్వే ఆధారంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళితే ఆశించిన ఫలితం వస్తుందనే అంచనాలో ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు