సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన

CM KCR‌ Districts Tour : తెలంగాణ సీఎం కేసీఆర్‌ త్వరలో జిల్లాల బాట పట్టనున్నారా? నూతనంగా నిర్మించిన టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాలను ప్రారంభించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి టీఆర్‌ఎస్‌ వర్గాలు. హైదరాబాద్‌ మినహా మిగిలిన జిల్లాల్లోనూ పార్టీ ఆఫీస్‌ల నిర్మాణం పూర్తయ్యింది. దీంతో వాటిని ప్రారంభించేందుకు సీఎం రెడీ అవుతున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. నూతనంగా నిర్మించిన జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీస్‌లను ఏర్పాటు చేయాలని రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు.

అనంతరం పార్టీ కార్యాలయాల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఏడాదిలోగా వాటిని నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని ముందుగా భావించారు. అయితే కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు. రాష్ట్రంలోని సగానికిపైగా జిల్లాల్లో కార్యాలయాల నిర్మాణం పూర్తి అయ్యింది. మరికొన్ని జిల్లాల్లో నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

ఇప్పటి వరకు సిద్దిపేటలో మాత్రమే టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. దీనికి కేసీఆర్‌ ప్రారంభోత్సవం కూడా చేశారు. మిగిలిన జిల్లాల్లో మాత్రం పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం జరుగలేదు. పార్టీ ఆఫీస్‌ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా నేతలకు ఈ మధ్యే గులాబీ బాస్‌ నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో జిల్లాల్లో కార్యాలయాల పనులు అధికారపార్టీ నేతలు శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పార్టీ కార్యాలయాలకు సంబంధించిన సమాచారం గులాబీ బాస్‌కు అందింది. సంక్రాంతి పండుగ తర్వాత ప్రారంభించాలని ముందుగా అనుకున్నా.. ముహూర్తాలు లేకపోవడంతో…. ప్రారంభోత్సవాల్లో జాప్యం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాని. దీంతో అప్పుడే జిల్లా పార్టీ ఆఫీస్‌ల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్‌ చేసే అవకాశముంది. అప్పుడే కేసీఆర్‌ జిల్లాల బాట పట్టనున్నారు.