Site icon 10TV Telugu

కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ భేటీ.. రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టు అనుమతులకై విజ్ఞప్తి.. హైదరాబాద్ డైపోర్టు – బందరుకు రైల్వేలైన్ కూడా.. అ జిల్లాలకు మహర్ధశ..

CM Revanth Reddy meet union minister ashwini vaishnaw

CM Revanth Reddy meet union minister ashwini vaishnaw

CM Revanth Reddy meet union minister ashwini vaishnaw: కేంద్ర ఐటీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, ప్రపంచ స్థాయి పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటుకు ఈఎంసీ 2.0 పథకం కింద తెలంగాణ ఇచ్చిన వినతిని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రీజినల్ రింగు రోడ్డు సమీపంలో నూతన ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్ఛరింగ్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. రీజినల్ రింగు రైలుకు త్వరగా అనుమతి ఇవ్వాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Also Read: రెయిన్ అలర్ట్.. తెలంగాణలో నాలుగు రోజులు దంచికొట్టనున్న వానలు.. ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త.. హైదరాబాద్‌లోనూ దంచికొడుతున్న వర్షం..

రాష్ట్రంలో రైల్వే అనుసంధానత పెంపుకోసం నూతన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని అశ్వినీ వైష్ణవ్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డుకు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించామని, ఇందుకు రైల్వే బోర్డు ఇప్పటికే ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. రూ.8వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. రీజినల్ రింగ్ రైలుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానత పెరగడంతోపాటు హైదరాబాద్ నగరంలోని ప్రధాన స్టేషన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు.

ఖాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ఆపరేషన్లను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఖాజీపేట రైల్వే డివిజన్ అవసరమని తెలిపారు. ప్రయాణికులకు భద్రత, వేగవంతమైన సేవల కోసం దీనిని ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా.. హైద‌రాబాద్ డ్రైపోర్ట్ నుంచి బంద‌రు ఓడ రేవుకు అనుసంధానంగా రైలుమార్గం మంజూరు చేయాల‌ని సీఎం రేవంత్ కోరారు. ఔష‌ధాలు, ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్ప‌త్తుల ఎగుమ‌తులు, ప‌లు దిగుమ‌తుల‌కు ఈ మార్గం దోహ‌ద‌ప‌డుతుంద‌ని వివరించారు.

తెలంగాణలోని వివిధ ప్రాంతాల అనుసంధానం, పారిశ్రామిక, వ్యవసాయక ఎగుమతులు, దిగుమతులు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నూతన రైలు మార్గాలకు సంబంధించి పలు ప్రతిపాదనలను అందించారు. వికారాబాద్ – కృష్ణా (122 కి.మీ అంచనా వ్యయం రూ.2,677 కోట్లు), కల్వకుర్తి – మాచర్ల (100 కి.మీ అంచనా వ్యయం రూ.2వేల కోట్లు), డోర్నకల్ – గద్వాల (296కి.మీ అంచనా వ్యయం రూ.6,512 కోట్లు), డోర్నకల్ – మిర్యాలగూడ (97 కి.మీ అంచనా వ్యయం 2,184 కోట్లు) మార్గాలను వందశాతం రైల్వేశాఖ వ్యయంతో మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే, సీఎం విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. తద్వారా రాబోయే కాలంలో ఆయా జిల్లాలకు రైల్వే కనెక్టివిటీ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

Exit mobile version