CM Revanth Reddy Open Letter (Photo : Facebook)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పారు. ”తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రశ్నించే గొంతుకు ప్రాణం పోసిన గడ్డ మల్కాజ్ గిరి. కొడంగల్ లో నడి రాత్రి ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన సందర్భాన్ని చూసి మల్కాజ్ గిరి చలించింది. కేవలం 14 రోజుల వ్యవధిలోనే నన్ను తమ గుండెల్లో పెట్టుకుంది. ప్రశ్నించే గొంతుకై తెలంగాణ మొత్తానికి రక్షణగా నిలబెట్టింది. ఈరోజు తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి పునాదులు పడింది మల్కాజ్ గిరిలోనే.
నా రాజకీయ ప్రస్థానంలో కొడంగల్ తో సమానంగా మల్కాజ్ గిరికి ప్రాధాన్యత ఉంది. నన్ను దేశానికి పరిచయం చేసిన ఘనత మల్కాజ్ గిరి ప్రజలదే. ఐదేళ్లు మీరు ఆశించిన ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేశాను. విస్తృత బాధ్యతల నేపథ్యంలో వ్యక్తిగతంగా కొన్నిసార్లు అనుకున్నంత సమయం ఇవ్వలేకపోయి ఉండవచ్చు. దేశ రక్షణ కోసం తల్లి బిడ్డను పంపినట్టు నన్ను తెలంగాణ రక్షణ కోసం గెలిపించి పంపారు.
Also Read : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. నిబంధనలు ఇవే
ఇన్నాళ్లు ఆ బాధ్యతను త్రికరణ శుద్దిగా నిర్వర్తించానని భావిస్తున్నా. ఐదేళ్లే కాదు.. నా గుండెల్లో మీ స్థానం శాశ్వతం. మల్కాజ్ గిరి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నాడు మీరు పోసిన ఊపిరి.. నా చివరి శ్వాస వరకు తెలంగాణ ఉజ్వల భవిత కోసం తపిస్తూనే ఉంటుంది” అని లేఖలో పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తాను లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశానని రేవంత్ రెడ్డి చెప్పారు. ‘లోక్ సభ సభ్యత్వానికి నేడు రాజీనామా చేశా. ఈ రాజీనామా నా ఎంపీ పదవికి మాత్రమే. నా మనసులో మల్కాజ్‌గిరి ప్రజల స్థానం శాశ్వతం. ప్రశ్నించే గొంతుకగా నన్ను పార్లమెంటుకు పంపిన ఇక్కడి ప్రజలతో నా అనుబంధం శాశ్వతం’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read : అహంకారంతో ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశాం.. ఏపీలో కూడా అదే చూస్తాం: చంద్రబాబు
కాగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. లోక్ సభ స్పీకర్ కు రాజీనామా లేఖను సమర్పించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా గెలిచారు రేవంత్ రెడ్డి. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి తేవడంలో కీ రోల్ ప్లే చేసిన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టారు.