Telangana Congress: కాకరేపిన ‘కరెంట్’ కామెంట్లు.. రేవంత్‌రెడ్డిపై రగులుతున్న సీనియర్లు

సీఎంగా సీతక్కను చేస్తామన్న రేవంత్ ప్రకటనతో కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోతున్నారు. సీఎం పదవి కోసం ఎంతో మంది పోటీలో ఉండగా.. రేవంత్ ఏకపక్షంగా సీతక్క పేరు ఎలా ప్రకటిస్తారని అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు.

Revanth Reddy

Telangana Congress Party: కాంగ్రెస్‌లో సీనియర్లకు మళ్లీ పని దొరికినట్లే కనిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వ్యతిరేక వర్గం మళ్లీ యాక్టివ్ అవుతున్నారనిపిస్తోంది. ఇన్నాళ్లు గ్రూప్ పాలిటిక్స్‌కు విరామం ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్లు (Congress Senior Leaders).. మళ్లీ లేఖలతో యుద్ధానికి తెరలేపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. హస్తం పార్టీలో ఎప్పుడూ ఉండే వర్గ విభేదాలు.. కొంత విరామం తర్వాత మళ్లీ మొదలవ్వడానికి కారణమేంటి..?

అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి.. అక్కడి తానా సభల్లో (TANA Conference ) చేసిన కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి. సీతక్కే సీఎం.. 24 గంటలు విద్యుత్ అవసరం లేదంటూ పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రచ్చ.. రచ్చగా మారాయి. కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా సీఎం అభ్యర్థిత్వంపై ప్రకటనలు చేయడం.. వ్యవసాయానికి మూడు నుంచి 8 గంటల విద్యుత్ సరఫరా చేస్తే సరిపోతుందని చెప్పడం రాజకీయంగా కలకలం రేపింది. సీఎంగా సీతక్కను చేస్తామన్న రేవంత్ ప్రకటనతో కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోతున్నారు. సీఎం పదవి కోసం ఎంతో మంది పోటీలో ఉండగా.. రేవంత్ ఏకపక్షంగా సీతక్క పేరు ఎలా ప్రకటిస్తారని అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ రచ్చ అలా కొనసాగుతుండగానే.. ఉచిత విద్యుత్‌పై చేసిన కామెంట్లు కాకరేపాయి.

నిజానికి చాలా కాలం నుంచి కాంగ్రెస్ సీనియర్లకు పెద్దగా పనిలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అధిష్టానం టార్గెట్ పెట్టడం.. రేవంత్‌కు వ్యతిరేకంగా చేస్తున్న ఫిర్యాదులను హైకమాండ్ లైట్ తీసుకుంటుడటంతో గ్రూప్ పాలిటిక్స్‌కు తాత్కాలిక విరామం ప్రకటించారు కాంగ్రెస్ సీనియర్లు. అదేసమయంలో మాణిక్‌రావ్ ఠాక్రే (Manikrao Thakre) ఇన్‌చార్జిగా వచ్చిన తర్వాత సీనియర్లకు కూడా సమ ప్రాధాన్యం ఇస్తుండటంతో రేవంత్ వ్యతిరేక రాజకీయం చాలా వరకు తగ్గిపోయింది. ఇంతలో కర్ణాటక విజయం కాంగ్రెస్‌ను ఒక్కతాటిపైకి తెచ్చింది. పాదయాత్రలు.. బహిరంగ సభలు.. పార్టీ కార్యక్రమాలతో ఖాళీ లేకపోవడంతో సీనియర్లు కూడా కాస్త వెనక్కి తగ్గి ఎవరి పనిలో వారు బిజీ అయిపోయారు.

Also Read: ప్రపంచంలో ఇలాంటి పదవి అంటూ ఒకటి ఉంటుందా.. ఈటలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టాస్క్ ఏంటి?

ఇలా అంతా బాగుంది.. అందరూ సెట్ అయిపోయారన్న సమయంలో రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన చిచ్చు రేపింది. తానా సభల్లో అనసవర కామెంట్లు చేసిన రేవంత్ స్వయంగా తన వ్యతిరేకులకు అస్త్రాలిచ్చినట్లు విశ్లేషిస్తున్నారు. రేవంత్ కామెంట్లపై ఒకరిద్దరు నేతలు మద్దతుగా మాట్లాడినా.. చాలా మంది నేతలు మాత్రం అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నట్లు గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెడితే.. రేవంత్ అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని.. రేవంత్‌లో ఇంకా పాత వాసనలు పోలేదని ఫిర్యాదులు పంపుతున్నట్లు సమాచారం.

Also Read: ఇవాళ హిమాన్షు నా కళ్లు తెరిపించారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ

అధికార బీఆర్‌ఎస్ కూడా రేవంత్ వ్యాఖ్యలను క్యాష్ చేసుకోవాలని భావిస్తూ ఆందోళనలకు పిలుపునివ్వడంతో.. హైకమాండ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే స్వయంగా మీడియాతో మాట్లాడుతూ రేవంత్ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చుకోవాల్సివచ్చింది. అంటే రేవంత్‌కు వ్యతిరేకంగా సీనియర్లు పంపిన మెసేజ్‌లతోనే అధిష్టానం జోక్యం చేసుకోవాల్సివచ్చిందని.. అమెరికా నుంచి తిరిగిరాగానే పీసీసీ చీఫ్ నుంచి వివరణ తీసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో ఇన్నాళ్లు కాస్త భిన్నంగా కనిపించిన కాంగ్రెస్ ఏ మాత్రం మారలేదని ఈ ఎపిసోడ్‌తో తేలిపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు