Eatala Rajender: ప్రపంచంలో ఇలాంటి పదవి అంటూ ఒకటి ఉంటుందా.. ఈటలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టాస్క్ ఏంటి?

అధ్యక్షుడిని మార్చినా ఈటలపై మాత్రం పెద్ద భారమే మోపింది. సంజయ్ పక్కకు తప్పుకోవడంతో బీజేపీలో చేరికలు పెరుగుతాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Eatala Rajender: ప్రపంచంలో ఇలాంటి పదవి అంటూ ఒకటి ఉంటుందా.. ఈటలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టాస్క్ ఏంటి?

Eatala rajender face challenges in BJP

Eatala Rajender: బీజేపీ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌పై ఇప్పుడు భారీ బాధ్యతలే మోపింది కాషాయ దళం. బీఆర్ఎస్ (BRS Party) నుంచి బీజేపీలో చేరిన రాజేందర్‌కు తొలుత.. చేరికల కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. ప్రపంచంలో ఇలాంటి పదవి అంటూ ఒకటి ఉంటుందా? అంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన ఈటల.. బండి సంజయ్‌ (Bandi Sanjay) అధ్యక్షునిగా ఉండటం వల్లే పార్టీలో చేరికలు జరగడం లేదంటూ అధిష్టానానికి ఫిర్యాదుల పరంపర కొనసాగించారు. ఈటల ప్రభావమో.. మరే కారణమో కానీ సంజయ్‌ను తప్పించిన కమలం పార్టీ కిషన్‌రెడ్డి(Kishan Reddy)ని అధ్యక్షుడిని చేసింది. అధ్యక్షుడిని మార్చినా ఈటలపై మాత్రం పెద్ద భారమే మోపింది. అదే పార్టీలో చేరికలు పెంచడం.. ఉన్న నేతలను కాపాడుకోవడం.. ఈ టాస్క్ ఈటలను ఉక్కిరిబిక్కిరి చేస్తుందంటున్నారు? కాషాయదళం చెదిరిపోకుండా కాపాడుకోవడం ఎలా? ఈటల ఏం చేయగలరు? బీజేపీలో తెరచాటు రాజకీయం ఎలా ఉంది?

ఎన్నికల ముందు కమలం పార్టీ సరికొత్త సమస్యలు ఎదుర్కొంటోంది. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటూ దూకుడు చూపించిన కమలదళం కొన్నాళ్లుగా అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. ఇన్నాళ్లు కలిసికట్టుగా పనిచేసిన నేతలు.. ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఖమ్మం నేత పొంగులేటి.. పాలమూరు నేత జూపల్లి కృష్ణారావును బీజేపీలో చేర్చుకోవడంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. అధికార బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈ ఇద్దరు నేతలు చాలా కాలం ఊగిసలాట తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. వారిద్దరూ బీజేపీలో చేరకపోవడానికి అప్పటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ వైఖరే కారణమని సీనియర్ నేత ఈటల బ్యాచ్ ప్రచారం చేసింది. అధిష్టానానికి రకరకాల నివేదికలు.. విశ్లేషణలు పంపారు. బండిని తప్పించి మరొకరికి బాధ్యతలు అప్పగిస్తేనే తెలంగాణ బీజేపీ స్పీడ్ పెరిగిపోతుందని ఈటలతో సహా అసంతృప్త నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లడం.. అధిష్టానం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాష్ట్ర బీజేపీ బాధ్యతలు అప్పగించడం చకచక జరిగిపోయింది. అదే సమయంలో ఈటలపై చేరికల భారం మోపింది అధిష్టానం.

Also Read: బీఆర్ఎస్ కు ఇబ్బందిగా కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి.. హుజూరాబాద్ టిక్కెట్ పై పునరాలోచన!

చేరికలకు సంజయ్ అడ్డుగా ఉన్నారని చెప్పిన ఈటల.. ఇప్పుడు ఏం చేస్తారా? అన్నది బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. సంజయ్ పక్కకు తప్పుకోవడంతో బీజేపీలో చేరికలు పెరుగుతాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర నాయకత్వం మారినా కమలదళంలో లొల్లి మాత్రం తగ్గడంలేదు. సంజయ్‌ను అకారణంగా తప్పించారని రగిలిపోతున్న చాలా మంది సీనియర్లు.. బీఆర్ఎస్‌ను గద్దె దించడం బీజేపీ వల్ల కాదని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ (Dharavath Ravinder Naik ) వంటి వారు పక్కచూపులు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వారిని కాపాడుకోవడం ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ ఈటలకు ప్రధాన బాధ్యతగా మారింది. ఉన్న నేతలను పార్టీ నుండి పోకుండా చూసుకోవడం.. కొత్తవారిని పార్టీలోకి తీసుకురావడం అనేది ఈటలకు బిగ్ టాస్క్ గా మారింది. ఈ రెండింట్లోనూ ఈటల సక్సెస్ అయితేనే ఆయనకు, కమలదళానికి కొత్త జోష్ వస్తుంది.. ఇప్పుడిదే ఈటలకు కత్తిమీద సాములా మారింది.

Also Read: అమెరికా టూర్.. కన్ఫ్యూజన్‌లో కిషన్ రెడ్డి, కేబినెట్ విస్తరణపై రాని క్లారిటీ

బీజేపీలో ఎన్నడూ లేనట్లు ఈ మధ్య అసంతృప్తి స్వరాలు బాగా పెరిగిపోయాయి. ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ మంత్రి వివేక్, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీంద్రరెడ్డి, యొన్నం శ్రీనివాసరెడ్డి లాంటి వారు పార్టీ లైన్ లోనే ఉన్నారా.. లేదా అన్నది కూడా తేలడం లేదు. వీరందరినీ గడప దాటకుండా కాపాడుకోవడం ఈటలకు సవాల్ గా మారింది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను పోటీలో నిలపాలంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి పెద్దపెద్ద నాయకులను ఆకర్షించాల్సి వుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదంత ఈజీ టాస్క్ మాత్రం కాందంటోంది కమలదళం. మరి ఈటల ఇందులో ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.