వ్యాక్సిన్ సురక్షితం..భయం వద్దు

telangana corona vaccine : ప్రపంచ దేశాలను అల్లాడించిన కరోనా వైరస్ అడ్డుకట్ట వేసేందుకు భారత దేశం ముందడుగు వేసింది. వైరస్ నుంచి రక్షణ కల్పించే టీకాల కార్యక్రమం దేశ వ్యాప్తంగా శనివారం నుంచి ప్రారంభమైంది. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. తొలి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకాలు వేశారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏ టీకా వేసుకున్నా జ్వరం, కండరాల నొప్పి, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయని, వీటి గురించి పెద్దగా ఆలోచించవద్దని ప్రజలకు సూచించారు.

ఒకటి రెండు రోజుల్లో వాటంతట అవే తగ్గిపోతాయని, పారాసిటమల్‌ వంటివి తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. రెండో డోస్‌ తర్వాత కాస్త ఎక్కువ రియాక్షన్లు ఉండే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎవరకైనా సమస్య తీవ్రమైతే చికిత్స చేసేందుకు 57 ఆసుపత్రులను సిద్ధం చేశామన్నారు. టీకాల సామర్థ్యంపై అపోహలు వద్దని విజ్ఞప్తిచేశారు. మనం ప్రస్తుతం ఎన్నో రకాల వ్యాక్సిన్లు వాడుతున్నామని, కొన్ని టీకాలు వేసిన తర్వాత రియాక్షన్లు కనిపిస్తాయని తెలిపారు. ఇది అత్యంత సాధారణమని చెప్పారు.

కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. కోవిడ్ -19 వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్‌లో గర్భవతి, బాలింతలను భాగం చేయలేదని.. లబ్ధిదారులు రెండు రకాల టీకాలు వేసుకోవద్దని కేంద్రం స్పష్టం చేసింది. 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఏ టీకా అయితే మొదటి డోసు తీసుకుంటారో అదే టీకా రెండో డోసులో తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే…. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్యం, పోలీసులు తదితర విభాగాల సిబ్బందికి టీకా వేస్తారు. ఆ తర్వాత 50 ఏండ్లు దాటినవారికి, అనంతరం 18 నుంచి 50 ఏండ్ల మధ్య వయసు ఉండి, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారికి టీకా ఇవ్వనున్నారు. చివరి దశలో మిగతా ప్రజలకు అందజేస్తారు.