CPM Secretary Tammineni Veerabhadram
CPM Secretary Tammineni Veerabhadram : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎప్పటిలానే ఒంటరిగా పోటీ చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు మాత్రం పొత్తుల కోసం మల్లగుల్లాలు పడుతున్నాయి. కాంగ్రెస్ కమ్యూనిస్టులతో పొత్తుల కోసం మంతనాలు జరిపితే .. బీజేపీ జనసేనతో మంతనాలు జరిపాయి. బీజేపీ.. జనసేనకు మధ్యా పొత్తుల విషయంలో క్లారిటీ వచ్చినా.. సీట్ల విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్, కామ్రెడ్ల పొత్తులు మాత్రం పొసగలేదు. సీట్ల విషయం సర్దుబాటు కాకపోవటంతో కామ్రెడ్లు డెడ్ లైన్ పెట్టారు. అయినా కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఒంటరిగానే పోటీకి దిగాలని నిర్ణయించింది సీపీఎం.
కాంగ్రెస్ కు కామ్రెడ్లు సీట్ల కేటాయింపు విషయంలో విధించిన డెడ్ లైన్ ముగియటంతో ఇక ఒంటరిగానే చేస్తామని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ వైరా, మిర్యాలగూడ స్థానాలను తమకు కేటాయించకపోతే తాము ముందుకు వెళ్లతామని తమ్మినేని చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ తేల్చకపోవటంతో కామ్రెడ్లకు కాలింది. దీంతో ఒంటరిగానే పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చిన తమ్మినేని 17 స్థానాల్లో పోటీకి దిగుతున్నామని తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో పోటీకి దిగుతున్నామని తెలిపారు. కానీ ఈ 17 స్థానాలకు అభ్యర్ధుల్ని మాత్రం ప్రకటించలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అశ్వారావుపేట, పాలేరు, మధిరల్లో సీపీఎం పోటీ చేయాలని నిర్ణయించింది. అభ్యర్ధుల విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయని మార్పులు చేర్పుల విషయంలో చర్చించి నిర్ణయం తెలియజేస్తామని తెలిపారు. తమకు పట్టు ఉన్న భద్రాచలం స్థానాన్ని వదులుకోవటానికి సిద్దపడ్డామని.. ఆఖరికి పాలేరు కూడా వదులుకోవటానికి సిద్ధపడ్డామని.. ఇలా ఎన్ని మెట్లు దిగినా కాంగ్రెస్ మాత్రం తన పంథా తనదే అన్నట్లుగా వ్యవహరించటంతో అంత అవమానకర పరిస్థితులు తమకు అవసరం లేదన్నారు.
కనీసం వైరా, మిర్యాల గూడ సీట్లు ఇస్తే పొత్తులకు సిద్ధమని కబురు చేసినా కాంగ్రెస్ పొసగనివ్వలేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంటరి పోటీ తప్ప వేరే మార్గం లేదన్నారు. ఎన్ని మెట్లు దిగినా తన వ్యవహర శైలిని మార్చుకోని కాంగ్రెస్ నేతల చౌకబారు మాటలు సరికావని హితవు పలికారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7, ఉమ్మడి నల్లగొండలో 6, ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డిల్లో ఒక్కోచోట పోటీకి సిద్ధమన్నారు. మరో మూడు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని వాటి విషయంలో రాష్ట్ర కమిటీలో చర్చించాక ఏ విషయం చెబుతామన్నారు.
Also Read : ఢిల్లీ దొరలకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య యుద్ధం : రాహుల్ గాంధీకి కేటీఆర్ కౌంటర్
కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా లేకపోయినా సీపీఎం, సీపీఐ కలిసే పోటీ చేస్తాయని నిన్న మాట్లాడిన తమ్మినేని కాంగ్రెస్ వైఖరితో విసుగు చెంది ఒంటరి పోటీకి సిద్ధపడ్డారు. ఒకవేళ సీపీఐ.. కాంగ్రెస్ కలిసి వెళ్తే సీపీఎం ఒంటరి పోరు చేస్తుందని ప్రకటించారు.
మరోపక్క సీట్ల కేటాయింపు విషయంలో తెలంగాణ బీజేపీలో జనసేన చిచ్చు కొనసాగుతోంది. పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే సీట్ల వ్యవహారం బీజేపీ నేతలకు కోపం తెప్పిస్తోంది. జనసేనకు టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. నాగర్ కర్నూల్ టికెట్ జనసేకు కేటాయిస్తే అంగీకరించేది లేదని ఆ నియోజకవర్గం బీజేపీ నేతలు అంటున్నారు.