Medaram Maha Jatara : మేడారం జాతరకు వెళ్లే వారికి అలర్ట్.. రూట్‌మ్యాప్, ట్రాఫిక్ అప్‌డేట్స్.. ఇతర సౌకర్యాల సమాచారంకోసం ఇలా చేయండి.. హాయ్ అని మెస్సేజ్ చేస్తే చాలు..
Medaram Maha Jatara : మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రభుత్వం మేడారం జాతర పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్, వెబ్ సైట్, మై మేడారం వాట్సాప్ చాట్‌బాట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Medaram Maha Jatara
- మేడారం మహా జాతరకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్
- మేడారం జాతర యాప్, వెబ్‌సైట్ రెడీ
- అందుబాటులోకి ‘మై మైడారం’ వాట్సాప్ చాట్‌బాట్
- రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్ డేట్స్ నుంచి మిస్సింగ్ కేసుల వరకు అన్నీ మొబైల్‌లోనే
Medaram Maha Jatara : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. మేడారం మహాజాతర ఈనెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనుంది. అయితే, బుధవారం సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజుల పూజారులు గుడిమెలిగే పండుగకు శ్రీకారం చుడుతున్నారు. మేడారంలోని సమ్మక్క గుడిని శుద్ధిచేసి పుట్టమట్టితో అలికి అందమైన ముగ్గులతో అలంకరిస్తారు. అలాగే గద్దెలను కూడా శుద్ది చేస్తారు. ఇదే మహాజాతర ప్రారంభోత్సవానికి సంకేతం.
Also Read : Bhogi Festival 2026: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి వేడుకలు.. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ
మేడారం మహాజాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు.. జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తోంది. మహాజాతరను పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైటెక్ సేవలందిస్తుంది. ఈ మేరకు అధికారులు ప్రత్యేకంగా మొబైల్ యాప్, వెబ్ సైట్, వాట్సాప్ చాట్‌బాట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మేడారం జాతరకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అరచేతిలో చూసుకునేలా వీటిని రూపొందించారు.
సమ్మక్క, సారమ్మలను దర్శించుకొని, మొక్కులు తీర్చుకునేందుకు మేడారం జాతరకు కోట్లాది మంది ప్రజలు తరలివెళ్తుంటారు. మహాజాతరకు తరలివెళ్లే భక్తులకు రూట్ మ్యాప్స్, పార్కింగ్, ఇతర సౌకర్యాల కోసం ఇబ్బంది పడకుండా ‘మేడారం జాతర’ పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్ ను, https://medaramjathara2026.com పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించారు. వీటితోపాటు స్మార్ట్ ఫోన్ వాడే ప్రతీఒక్కరికీ సులభంగా ఉండేలా 7658912300 నంబర్ తో ‘మై మేడారం’ వాట్సాప్ చాట్‌బాట్ సేవలను కూడా ప్రారంభించారు. ఈ నంబర్ కు హాయ్ అని మెసేజ్ చేస్తే సమాచారం మీ మొబైల్ కు వస్తుంది.
వెబ్‌సైట్‌లో జాతర సమస్త సమాచారం పొందుపర్చారు. జాతరకు వెళ్లే రహదారులు, ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేలా రూట్స్ సెట్ చేశారు. మంచినీటి కేంద్రాలు, టాయిలెట్ బ్లాక్స్, స్నానఘట్టాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గూగుల్ మ్యాప్ లో లొకేషన్ తో సహా తెలుసుకోవచ్చు. అదేవిధంగా మెడికల్ క్యాంపులు ఎక్కడున్నాయి..? హెల్ప్ డెస్క్ నంబర్లు, పోలీస్ స్టేషన్ల వివరాలు అందుబాటులో ఉంటాయి.
మహాజాతరకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో మేడారం పరిసర ప్రాంతాలు ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోతాయి. ఇలాంటి తరుణంలో జాతరలో ఎవరైనా తప్పిపోతే వెంటనే రిపోర్టు చేసే సిస్టమ్, ఇతర సమస్యలపై ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. వీటితోపాటు మేడారం జాతర చరిత్ర, అమ్మవార్ల విశిష్ఠతను కూడా ఇందులో పొందుపర్చారు.
