Srinivas Rao On Withcraft
DH Srinivas On Witchcraft : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ రావ్ క్షుద్ర పూజలు చేస్తున్నారన్న వార్తలు కలకలం రేపాయి. దీనిపై దుమారం రేగింది. ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొత్తగూడెంలో జరిగిన పూజల్లో శ్రీనివాస్ పాల్గొన్న వీడియోలు కూడా మీడియాలో ప్రసారం కావడం మరింత దుమారం రేపింది. దీంతో హెల్త్ డైరెక్టర్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.
క్షుద్రపూజల్లో పాల్గొనట్టు తనపై వచ్చిన ఆరోపణలను శ్రీనివాస్ ఖండించారు. అందులో నిజం లేదన్నారు. అసలేం జరిగిందో ఆయన వివరించారు. సుజాత నగర్ ఎంపీపీ చేపట్టిన పూజలో మాత్రమే తాను పాల్గొనట్లు ఆయన తెలిపారు. అక్కడ జరిగింది క్షుద్రపూజ కాదని, కేవలం హోమం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. తనకు ఎలాంటి రాజకీయాలు అవసరం లేదన్నారు.(DH Srinivas On Witchcraft)
New Goddess : కొత్త దేవత.. దేవత అవతారమెత్తిన ప్రజాప్రతినిధి.. తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ పూజలు
‘మా నాన్న పేరిట చారిటబుల్ ట్రస్ట్ పెట్టాం. సేవలో భాగంగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఎంపీపీలు పూజలు చేస్తున్నామని పిలిచారు. హాలిడేలో భాగంగా కొత్తగూడెం వెళ్లాను. బంజారా గిరిజన దేవత పూజకు మాత్రమే హాజరయ్యా. నేను హోమానికే దండం పెట్టాను. వ్యక్తికి దండం పెట్టలేదు. హోమంలో పాల్గొని బొట్టు మాత్రమే పెట్టుకున్నా. అంతే. అంతకుమించి ఏమీ లేదు. రాజకీయాలతో నాకు సంబంధం లేదు” అని డీహెచ్ శ్రీనివాస్ వివరించారు.
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వివాదంలో చిక్కుకున్నారు. ఖమ్మంలో డీహెచ్ శ్రీనివాస్ క్షుద్రపూజలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దేవతనని ప్రకటించుకున్న టీఆర్‌ఎస్ ఎంపీపీ చుట్టూ ఆయన ప్రదక్షిణలు చేశారు. అయితే ఈ విషయం బయటకు రావడంతో డీహెచ్ శ్రీనివాస్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ ఎంట్రీ కోసమే క్షుద్ర పూజలంటూ ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా కొత్తగూడెంలో డీహెచ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు.
సుజాతనగర్ మండలం సింగభూపాలెంలో కొత్త దేవత వెలిసిన సంగతి తెలిసిందే. దేవత అవతారంలో సుజాతనగర్ ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి ప్రత్యక్ష్యమయ్యారు. ప్రత్వంగిర మాత అనే కొత్త దేవత అవతారంలో ఎంపీపీ విజయలక్ష్మి దర్శనమిచ్చారు. దీంతో కొత్త దేవతకు ఎండు మిరపకాయలతో హోమాన్ని భక్తులు నిర్వహించారు. ఈ హోమంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నడం, పూజలు చేయడం దుమారం రేపింది. కొత్త దేవత చుట్టూ ఎంపీటీసీలు, సామాన్య ప్రజల ప్రదక్షిణలు చేయడం విశేషం.(DH Srinivas On Witchcraft)
అసలేం జరిగిందంటే..
దేవుడు కరుణించాలంటూ ఖమ్మంలో వింత పూజలు నిర్వహించారు డీహెచ్ శ్రీనివాస్. మంటల్లో నిమ్మకాయలు వేస్తూ ఆయన పూజలు చేశారు. తనను తాను దేవతగా ప్రకటించుకున్న మహిళా ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. దీంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. బాగా చదువుకున్నారు, పైగా పెద్ద స్థాయి పదవిలో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇలాంటి పూజల్లో పాల్గొనడం చర్చకు దారితీసింది. సైన్స్ బోధించాల్సిన డీహెచ్ ఇలాంటి పూజలు చేయడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ ఎంట్రీ కోసమే క్షుద్ర పూజల తరహాలో ఇదంతా చేస్తున్నారని డీహెచ్ శ్రీనివాస్ పై విమర్శలు వచ్చాయి.
దీనిపై స్పందించిన ఆయన.. తమ స్వస్థలం కొత్తగూడెం ప్రాంతంలో హెల్త్ క్యాంప్ నిర్వహించేందుకు అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. అయితే బంజారా కమ్యూనిటీ వాళ్లు తమ కుల దేవతకు పూజలు చేస్తున్నారని చెబితే ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లు వివరించారు. తాను హోమానికి దండం పెట్టానని, వ్యక్తికి కాదని చెప్పుకొచ్చారు. రాజకీయాలతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, ఆ మహిళ ప్రజా ప్రతినిధి అన్న విషయం తెలుసు కానీ ఆమె దేవతగా ప్రకటించుకున్నట్లు తెలీదన్నారు. తాను చేస్తున్న సేవా కార్యాక్రమాలు గిట్టని వారు స్థానిక రాజకీయ నేతలతో కలిసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని డీహెచ్ శ్రీనివాస్ మండిపడ్డారు.