Srinivasa Rao : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి చర్చకు దారితీసే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన జర్నలిస్టుల శిక్షణా తరగతుల్లో పాల్గొన్న డీహెచ్.. భద్రాచలంలో నక్సలైట్ల అడుగుజాడల్లో పెరిగానని చెప్పారు. వారి విధానాలకు ఆకర్షితుడినై దళంలో చేరాలనుకున్నా నని తెలిపారు. గన్ పట్టుకుని అడవులకు పోయింటే ఎప్పుడో అమరుడిని అయ్యేవాడినని చెప్పారు. అదృష్టం బాగుండి చదువుకోవడం వల్ల డాక్టర్ ని అయ్యానని డీహెచ్ శ్రీనివాసరావు చెప్పారు.
”భద్రాచలం ఏరియాలో మావోయిస్టుల అడుగుజాడల్లో పెరిగా. మావోయిస్టుల విధానాలకు ఆకర్షితుడినై దళంలో చేరాలనుకున్నా. పెన్ను పట్టుకోకపోయుంటే.. గన్ను పట్టుకుని ఉద్యమం చేసేవాడిని. అడవులకు పోయి ఉంటే ఎప్పుడో అమరుడిని అయ్యేవాడిని. గన్ను వదిలేసి అంతా పెన్ను పట్టుకోవాలి” అని డీహెచ్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
కాగా, తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు.. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కరోనాపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఏసుక్రీస్తు దయవల్లే కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. దేశాభివృద్ధికి క్రైస్తవ మతమే కారణమన్నారు. దీంతో ఒక్కసారిగా దుమారం రేగింది.
ఓ కార్యక్రమంలో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లకు డీహెచ్ శ్రీనివాసరావు నమస్కారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై విమర్శలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసమే ఆయనిలా చేశారని కామెంట్స్ చేశారు.
Also Read..DH Srinivas On Witchcraft : క్షుద్ర పూజల ఆరోపణలు.. స్పందించిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్
ఇక, తనను తాను దేవతగా చెప్పుకుంటున్న సుజాత నగర్ ఎంపీపీ విజయలక్ష్మితో కలిసి పూజల్లో పాల్గొన్న శ్రీనివాసరావు.. మంటల్లో నిమ్మకాయలు వేస్తున్న వీడియో కూడా బయటకొచ్చింది. అంతేకాదు ఆయన ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశారు. ఈ విషయం బయటకు రావడంతో డీహెచ్ శ్రీనివాస్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన క్షుద్ర పూజల్లో పాల్గొన్నారనే ఆరోపణలు కలకలం రేపాయి.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఉన్నత చదువులు చదివిన వ్యక్తి ఇలా మూఢ నమ్మకాలను ఫాలో అవడం ఏంటి? క్షుద్రపూజలు చేయడం ఏంటి? అని ప్రశ్నించారు. దీనిపై ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను పూజలో మాత్రమే పాల్గొన్నానని డీహెచ్ శ్రీవాసరావు వెల్లడించారు. స్థానికుల ఆహ్వానంతోనే పూజా కార్యక్రమానికి వెళ్లినట్లు చెప్పారు. తాను మూఢ నమ్మకాలను అస్సలు విశ్వసించనని స్పష్టం చేశారు. అక్కడ జరిగింది క్షుద్రపూజ కాదని, కేవలం హోమం మాత్రమేనని ఆయన తేల్చి చెప్పాలి. ఇలా పలు సందర్భాల్లో తన వ్యాఖ్యలతో, చేష్టలతో కాంట్రవర్సీల్లో చిక్కుకున్నారు డీహెచ్ శ్రీనివాసరావు.