Election Commission of India : కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణాలో ప్రధాన పార్టీలకు బిగ్ షాక్ ఇచ్చింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఈసీ కొరడా ఝళిపించింది. ఈసీ ఆదేశాలతో మూడు ప్రధాన రాజకీయ పార్టీల్లో కలవరం మొదలైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీల ప్రచారంపై దృష్టి సారించి నియమావళిని ఉల్లంఘించి ప్రకటనలు జారీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) సంచలన ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాయని ఈసీ పేర్కొంది. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నియమ, నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో తెలంగాణలో ఎన్నికల ప్రచార సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 15 వీడియో ప్రకటనలను నిషేధించినట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది.
15 ఎన్నికల ప్రచార ప్రకటనలపై నిషేధం
ఎన్నికల కమిషన్ నిషేధించిన 15 ప్రచార ప్రకటనల్లో ఆరు కాంగ్రెస్‌కు చెందినవి, ఐదు భారతీయ జనతా పార్టీ, నాలుగు అధికార భారత రాష్ట్ర సమితి ప్రచార వీడియోలున్నాయి. తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వక్రీకరించిన కంటెంట్‌కు సంబంధించిన ఎన్నికల ప్రచార ప్రకటనలను నిషేధించినట్లు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) వికాస్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణలో ముక్కోణపు పోరు
నవంబర్ 30వతేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ సాగుతోంది. రాజకీయ పార్టీల ప్రచార ప్రకటనలకు రాష్ట్ర స్థాయి ఎంసీఎంసీ ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తుందని సీఈవో వివరించారు. అక్టోబర్ 9వతేదీ నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 416 ఎన్నికల ప్రచార ప్రకటనలు ధృవీకరించామని వికాస్ రాజ్ చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన 15 ఎన్నికల ప్రచార ప్రకటనల్లో మార్ఫింగ్ చేశారని, వక్రీకరించారని తెలంగాణకు చెందిన ఓ ఎన్నికల అధికారి చెప్పారు.
అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేయొద్దు
రాజకీయ పార్టీలు ఈసీ ముందస్తు అనుమతి లేకుండా యూట్యూబ్, సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచార వీడియోలు పోస్టు చేయరాదని ఈసీ అధికారులు స్పష్టం చేశారు. నిషేధించిన ఎన్నికల ప్రచార ప్రకటనలను ప్రసారం చేయవద్దని కోరుతూ మూడు పార్టీలకు పంపిన లేఖల కాపీలను ఎన్నికల కమిషన్ అన్ని ఎలక్ట్రానిక్,డిజిటల్ మీడియా ఛానెల్‌లకు పంపింది. రాజకీయ పార్టీల ప్రకటనలకు ధృవీకరణ అనేది నిరంతర ప్రక్రియ అని ఈసీ పేర్కొంది.
ప్రచార వీడియోల రద్దు
రద్దు చేసిన బీఆర్‌ఎస్ ప్రకటనలు కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రమోట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై దాడులకు సంబంధించినవి. ఉపసంహరించుకున్న ఐదు బీజేపీ ప్రకటనలు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపై ఘాటు వ్యాఖ్యలు చేసినవని ఈసీ తెలిపింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేయకపోవడంపై చేసిన ప్రచార వీడియోలను ఈసీ రద్దు చేసింది. ఆరు కాంగ్రెస్ ప్రకటనల్లో గులాబీ రంగు అంబాసిడర్ కారు, బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు, కేసీఆర్ ను పోలి ఉన్న వ్యక్తి చేసిన ప్రచార వీడియోలున్నాయి.
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠ దెబ్బతీసేలా…
నవంబర్ 7వతేదీన కాంగ్రెస్ విడుదల చేసిన ప్రకటనల్లో ప్రజలు తమ హామీలను నెరవేర్చనందుకు బీఆర్‌ఎస్ నాయకులను ప్రశ్నిస్తూ, వారిని తరిమికొట్టడం, కారు, గులాబీ రంగు బెలూన్‌లను పంక్చర్ చేయడం వంటివి చూపించాయి. ఎలక్ట్రానిక్ మీడియాలో కాంగ్రెస్ చేసిన ప్రకటనల ప్రచారం అభ్యంతరకరంగా ఉందని,ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ లీగల్ సెల్ ఈసీకి ఫిర్యాదు చేసింది.
ప్రచార వీడియోలపై ఫిర్యాదుల పర్వం
వార్తలు, వినోద టెలివిజన్ ఛానెల్‌లలో మాత్రమే కాకుండా, ఇప్పటికీ ప్రకటనలను ప్రసారం చేస్తున్న ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ప్రకటనలను నిషేధించాలని బీఆర్ఎస్ నాయకుడు, న్యాయవాది సోమ భరత్ ఈసీని కోరారు. కాంగ్రెస్ రాష్ట్ర అధినేత రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ అభ్యర్థులపై దాడికి కాంగ్రెస్ కార్యకర్తలను పదే పదే ఉసిగొల్పుతున్నారని ఆరోపిస్తూ, అతన్ని రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచార జాబితా నుంచి తొలగించాలని ఈసీని కోరుతూ సోమ భరత్ సోమవారం ఈసీకి మరో ఫిర్యాదు చేశారు.
రేవంత్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఫిర్యాదు
రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసేందుకు చర్యలు తీసుకోవాలని భరత్ ఈసీని కోరారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తమ పార్టీ ప్రకటనలను ఈసీ నిషేధించడంపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. ఓటమి భయంతో ఉన్న అధికార పార్టీ, బీజేపీ ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి సీహెచ్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ మాట్లాడుతూ ప్రకటనల కంటెంట్‌పై నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి ఉందన్నారు. మొత్తంమీద అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ పార్టీ ప్రచారం ఊపందుకుంది. పార్టీల ప్రచారంపై ఈసీ డేగకన్నుతో పరిశీలిస్తోంది.