Telangana Elections 2023: ఆ ప్రాంతాల్లో ఓటేసేందుకు ఆసక్తి చూపించని ఓటర్లు.. ముఖ్యనేతల నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం ఇలా..

సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్‌ రేవంత్ పోటీపడిన కామారెడ్డిలో 74.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇక.. కేసీఆర్‌ పోటీచేసిన గజ్వేల్ లో ..

Telangana Election 2023

Telangana Elections 2023 Voting : తెలంగాణలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ అన్ని జిల్లాల్లోనూ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. మూడు కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నింక్షిప్తం చేశారు. రాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 70.66 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే, ఇవాళ ఉదయం 10గంటల తర్వాత వాస్తవ ఓటింగ్‌ శాతాన్ని ఈసీ వెల్లడించనుంది. ఇదిలాఉంటే.. గురువారం ఉదయం నుంచి మందకొడిగా పోలింగ్ జరగ్గా 10 గంటల తర్వాత క్రమంగా పుంజుకుంది. మధ్యాహం నుంచి ఓటర్లు పోటెత్తారు. సాయంత్రం భారీగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకున్నారు. నగరాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో మొదటి నుంచి పోలింగ్ నమోదు శాతం ఎక్కువగా ఉంది. పట్టణాలు, నగరాల్లో ఓటువేసేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపించలేదు.

Also Read : Revanth Reddy : ఎంత రాత్రి అయినా ఇవాళే వెల్లడించాలి- ఈసీకి రేవంత్ రెడ్డి డిమాండ్

యాదాద్రి జిల్లాలో అత్యధికంగా పోలింగ్..
యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత స్థానాల్లో మెదక్‌ జిల్లా 86.69 శాతం, జనగామ జిల్లాలో 85.74 శాతం, నల్గొండ జిల్లాలో 85.49శాతం, సూర్యాపేట జిల్లాలో 84.83శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 46.56 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. నియోజకవర్గాల వారీగా చూస్తే మునుగోడులో గరిష్ఠంగా 91.51 శాతం పోలింగ్ నమోదవగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లోని యాకుత్‌పురలో 39.69శాతం పోలింగ్‌ నమోదైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో 73.37 శాతం ఓటింగ్‌ నమోదైంది. తెలంగాణలోని పలుచోట్ల రాత్రి 8 గంటల వరకు, కొన్నిచోట్ల రాత్రి ఎనిమిదిన్నర దాటాక కూడా పోలింగ్‌ జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో రాత్రి తొమ్మిదిన్నర వరకు సాగింది. సాయంత్రం 5 గంటల తర్వాతకూడా ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్లలో వేచి ఉండటంతో వారికి టోకెన్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.

Also Read : Kishan Reddy : వైసీపీ, బీఆర్ఎస్ కుట్ర చేశాయి- కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు

ముఖ్యనేతల నియోజకవర్గాలో ఇలా..
సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్‌ రేవంత్ పోటీపడిన కామారెడ్డిలో 74.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇక.. కేసీఆర్‌ పోటీచేసిన గజ్వేల్ లో 80.32శాతం పోలింగ్ నమోదైంది. ఈటల బరిలో ఉన్న హుజురాబాద్‌లో 80.62 శాతం ఓటింగ్ నమోదుకాగా.. రేవంత్ పోటీ చేస్తున్న కొడంగల్‌లో 80.90శాతం ఓటింగ్ నమోదైంది. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పోటీ చేస్తున్న మధిరలో 87.83 శాతం, బండి సంజయ్ బరిలో ఉన్న కరీంనగర్ లో 64.17 శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పోటీచేసిన హుజూర్ నగర్‌లో 86.31 శాతం పోలింగ్ నమోదవగా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేసిన నల్గొండలో 81.50 శాతం ఓటింగ్ నమోదైంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోటీచేసిన మునుగోడులో రాష్ట్రంలోనే అత్యధికంగా 91.51 శాతం పోలింగ్‌ నమోదైంది.

 


 

ట్రెండింగ్ వార్తలు