Telangana Govt: తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు బిగ్అలర్ట్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ సమస్యలకు చెక్..

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ సరికొత్త వ్యవస్థను వెంటనే అమల్లోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

facial recognition

Telangana Govt: తెలంగాణలో అర్హులైన వారికి చేయూత పేరుతో ప్రభుత్వం పెన్షన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వేలి ముద్రల ఆధారంగా పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. అయితే, వృద్ధుల విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారి వేలిముద్రలు అరిగిపోవటం వంటి సమస్యలతో డబ్బులు డ్రా చేయడం ఇబ్బందికరంగా మారుతోంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర స్థాయిలో, ప్రజాభవన్, గాంధీ భవన్‌లలో.. జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి నేరుగా విజ్ఞప్తులను స్వీకరిస్తున్న దరఖాస్తులు, అర్జీలలో ఈ సమస్యను ప్రభుత్వం గుర్తించింది. దీంతో సమస్య పరిష్కరించేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. ‘చేయూత’ పెన్షన్ల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. బయోమెట్రిక్ సమస్యలకు చెక్ పెట్టే దిశగా.. ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.

రాష్ట్రంలో 44 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, హెచ్‌ఐవీ, డయాలసిస్‌ బాధితులకు ప్రభుత్వం రాష్ట్రంలో పెన్షన్లు అందిస్తుంది. వేలి ముద్రల సహాయంతో ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఈ విధానం వల్ల ముఖ్యంగా వృద్ధులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఫేసియల్‌ రికగ్నిషన్‌ (ముఖ గుర్తింపు) విధానం ద్వారా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ సరికొత్త వ్యవస్థను వెంటనే అమల్లోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 29వ తేదీన ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అమలు చేయాలని అధికారులు భావించారు. కానీ, సాంకేతిక సమస్యల కారణంగా ఆ తేదీ ఖరారు కాలేదు. తదుపరి తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే, తొలి దశలో పోస్టాఫీసు ద్వారా పెన్షన్లు పొందే 23లక్షల మందికే ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

పంపిణీ ఇలా…
పోస్టాఫీస్‌కు వెళ్లిన వారి ఫొటో తీసి ఆధార్‌లో ఉన్న ఫొటోతో సరిచూసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. అనంతరం వారికి పింఛను చెల్లిస్తారు. ఎవరికైనా ఫొటోలు తీయలేని పరిస్థితి ఉంటే బయోమెట్రిక్‌ విధానం ద్వారా పెన్షన్‌ ఇస్తారు. ముఖగుర్తింపు, బయోమెట్రిక్‌ పనిచేయని వారుంటే వారికి గ్రామ కార్యదర్శులు వేలిముద్రలు వేసి పెన్షన్‌ ఇప్పిస్తారు.