Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రైతులు పండించిన పంట ఉత్పత్తులను విక్రయించుకునేందుకు మరింత వెసులుబాటు కల్పించేలా చర్యలు చేపట్టింది. ఇదేక్రమంలో మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో 10 కొత్త మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో తుది ఉత్తర్వులను జారీ చేయనుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 197 మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 10 మార్కెట్ యార్డులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన తుది ఉత్తర్వులను జారీ చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. కొత్త మార్కెట్లు యార్డులు అందుబాటులోకి వస్తే వాటి సంఖ్య 207కి చేరనుంది.
రాష్ట్రంలో కొత్త మార్కెట్ యార్డులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో స్థలాలను సైతం గుర్తించింది. వీటి ఏర్పాటుకు ఇప్పటికే ప్రాథమిక, తుది నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కానందున ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో మార్కెట్ యార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటితోపాటు మరో ఐదు మార్కెట్ యార్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
కొత్త మార్కెట్ యార్డులు ఇవే..
♦ నాగర్‌కర్నూల్ జిల్లాలోని కోడేరు, పెద్దకొత్తపల్లి.
♦ వనపర్తి జిల్లాలోని పానగల్, వీవనగండ్ల, ఖిలాఘన్‌పూర్, గోపాల్‌పేట.
♦ పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు.
♦ హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి.
♦ నల్గొండ జిల్లాలోని దామరచర్ల.
♦ ఖమ్మం జిల్లాలోని మత్కేపల్లి (మధిర నియోజకవర్గం)